పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/231

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లతో వచ్చి మహాప్రభూ ! రాజప్రధాను లిరువురు పడిపోయిరి. ఆ వీరుఁడు గుఱ్ఱముచేత వారిం ద్రొక్కింపఁ బ్రయత్నించుచున్నాడని తెలియఁజేసిరి. జామాత ఆవార్త యంతకుమున్ను వినియుండ లేదు. వీరుఁ డెవ్వఁడు? రాజప్రధానుల ద్రొక్కించుటయేమి? అని విస్మయముతో నడిగిన కథయంతయుఁ జెప్పిరి.

అయ్యో ఇంతసేపు నాకుఁ దెలియనిచ్చితిరికారేమి! ఆవీరుఁ డెవ్వఁడు ? ఈ యడవి నడుమ కెట్లువచ్చెను ? వానికులసీల నామంబులు దెలిసికొనిరా? అని యడిగిన నవి యెవ్వరికిం దెలియవని యుత్తరము జెప్పిరి. అప్పుడతండు యొక గుఱ్ఱమెక్కి చంద్రహాసముబూని విల్లమ్ములఁదాల్చి యతి వేగముగా సింహద్వారముకడకుఁ బోయి యందున్న గుఱ్ఱముపైఁగూర్చుండి ప్రతివీరుని రాక నరయుచున్న హరివర్మంజూచిచూచి సంగరంబునకు దొడంగక యోహో! మహావీరా! నీ వెవ్వఁడవు? ఇక్కడి కెట్లు వచ్చితివి? ఊరక వారితోఁ గయ్యమేల సేసితివి? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నతండతని నెగాదిగఁ జూచి స్వరముదెలిసికొని యోహో! నీవు మా విద్యాసాగరుఁడవు వలె నుంటివే ? యనుటయు నతని గురుతుపట్టి తమ్ముఁడా ! హరివర్మా! నీవటోయి! నేఁడెంత సుదినము! అని గుఱ్ఱము దిగ్గనురికి యతని దాపునకు బోయి చేయందిచ్చెను. హరివర్మయు సంతోషముతోదిగి యతనిం గౌఁగలించుకొని యానందాశ్రవులచే నతని శిరము దడిపెను. గాఢాలింగనములచే నొండొరుల ప్రేమదెలిపికొనిరి. విద్యాసాగరుఁడు హర్ష గద్గద స్వరముతోఁ దమ్ముఁడా! మనతమ్ము లెందుండిరి ! నీ వెట్లిక్కడికి వచ్చితివి ? నీ వృత్తాంతము జెప్పుమని యడుగుటయు హరివర్మ విపరీత వాతంబునఁ దాను గొట్టుకొనిపోయినది మొదలు నాఁటి వఱకు జరిగిన కథయంతయు నెఱింగించి యతనికి విస్మయ సంతోషములు గలుగఁజేసెను.