పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బాగు. సృష్టికి బూర్వమీ పంచభూతములు లేనియప్పుడీప్రపంచక స్థాన మెట్లుండునో చెప్పుటకేకాదు. ఇట్లుండునని యూహించుటకు గూడ వీలులేదు. అది పరమేశ్వరునికే తెలియును. నారదమహర్షి రెండవజన్మము, అసిక్నియందు గలిగినది. వినుమని యన్వలికథపై మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

_________

211 మజిలీ

నారదుని గంధర్వ జన్మము.

క. తరమే విధిగతి దాటఁగ
   నొరులకు నారదమహర్షి యును గంధర్వాం
   బురుహాక్షుల నేబదుగురఁ
   బరిణయమై క్రీడ సలిపెఁ బరజన్మమునన్.

విద్యాధరాది దేవతావిశేషులలో గంధర్వు లొకతెగవారు. వారికి సంగీతమే కులవిధ్య. స్త్రీపురుషులు సంతతము గానపరిశ్రమ చేయుచుందురు. వారికి దేవలోకములోనేకాక భూలోకములోఁగూడ సంచారము గలిగియున్నది. గంధర్వులు స్త్రీపురుషులు మిక్కిలి చక్కనివారు. గంధర్వకన్యకలు అచ్చరలవలె స్వేచ్ఛావిహారములు సేయరు. భర్తలవరించి పాతివ్రత్యశీలంబుల నొప్పుచుందురు.

గంధర్వలోకములో నొకభాగము రత్న కేతుఁడను గంధర్వ రాజు పాలించుచుండెను. అతండు సకలైశ్వర్యసంపన్నుండయ్యు, సంతతిం బడయఁజాలక చింతించుచు వసిష్ఠోపదిష్టంబగు శివమంత్రంబు