పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/228

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుమతికథ.

215

హరివర్మాది రాజకుమారులు నలువురు తమగుఱ్ఱములెక్కి యాశ్వికులు పెక్కండ్రు చుట్టుకొనిరా మజిలీలు జేయుచు మృగముల వేటాడుచు నదీసైకతప్రదేశముల విహరింపుచు విచిత్రవృక్షలతా గుల్మాదులనవలోకింపుచు నిరువదిదినము లయ్యరణ్యమార్గంబునఁ బ్రయాణము సాగించిరి.

ఒకనాఁడొక మహారణ్యమధ్యంబున నిర్మలకుల్యాతీరసైకతలంబున విడిసి పటకుటీరంబుల వెలయించి యందలి ఫలతరులతా వితానంబులు వినోదము గలుగఁజేయ భార్యల ప్రోత్సాహంబున మూడుదివసంబు లందు వసించిరి. మఱియు వారు ప్రొద్దున లేచి వారువంబులెక్కి స్వారీచేసి రెండు గడియలలలోఁ దిరిగి వచ్చువారు.

మూడవనాఁడు హరివర్మ తూర్పుగాఁ బెద్దదూరము పోయి తిరుగా వచ్చునప్పుడు దారితప్పి దిగ్భ్రమజెంది వచ్చినదారియేదియో పోవలసినదారి యేదియో తెలియక మధ్యాహ్నముదనుక కనంబడిన దారినెల్లఁ బోవుచుండెను. అట్లు కొంతదూరము పోవఁ దూర్యనాదములు వినంబడినవి. అందులకు శంకించుకొనుచు నాప్రాంతమం దేదియో గ్రామమున్నదని నిశ్చయించి యాధ్వని ననుసరించి తన గుఱ్ఱమును నడిపించెను. పోయినకొలఁది యానాదములు హెచ్చుగా వినంబడుటయేకాక మనుష్యుల కోలాహలముతోఁ గూడ తౌర్యత్రిక రవంబు శ్రోత్రపర్వము గావించినది.

అతం డది గ్రామమని నిశ్చయించి వేగముగా గుఱ్ఱమును దోలుటయు నొక కోటగోడ యగుపించినది. దాని చుట్టునుం దిరిగి సింహద్వారము దాపునకువచ్చెను. అందు విచ్చుకత్తులతో రాజభటులు పహరాయిచ్చుచుండిరి. ఆకోటలో నేదియో శుభముజరుగుచున్నట్లు తెలిసికొని హరివర్మ ద్వారపాలురతో గుఱ్ఱముపైనుండియే యీకోట యెవ్వరిది ? లోపల జరుగుచున్న యుత్సవమేమని యడిగిన నతనిమాట యెవ్వరును వినుపించుకొనరైరి.