పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుమతికథ.

213

రని తెలిసికొని కోయవానివేషము వైచితిని. తరుచు జిలుకలు రాణి వాసములలో స్త్రీలచేఁ బెంపఁబడుచుండును. కావున నాభార్యచే గోయసానివేషము వేయించితిని. నాచేతినున్న రవ్వయుంగరమొకటి యమ్మి బంగారముకొని కరగించి యామూలిక దానిలోఁగలిపి మువ్వలు జేయించితిని.

వీఁటిసత్రములోఁ జేరినపిమ్మటఁ జిలుకగానున్న నాభార్యను మువ్వలు తగిలించి స్త్రీనిజేసితిని. చేయఁదగినకృత్యములు బోధించి కోయమాటలు నేర్పి యూరిలోనికిఁ బంపి మువ్వలమ్మించితిని. దైవకృపచే మాతమ్ములును గుఱ్ఱములును యథారూపము వహించినవి. చారుమతి నెత్తికొనివచ్చిన రక్కసుఁడు ఆనీరుత్రాగి చిలుకయై కొండ వాండ్రచేతిలోఁ జిక్కి బోగముదానికమ్మఁబడియుండెను. మామువ్వల సంపర్కంబున నాఁడు నిజరూపము దాల్చి యంతయల్లరి గావించెను. ఇదియే మాచరిత్రము. భగవంతుని యెత్తికోలు ఎవ్వరికిం దెలియదు గదా. ఇప్పటికి మేమందర మొక చోటికిఁ జేరుకొంటిమి. సిద్ధునికృపచే నీసంఘటనము గలిగినది. ఆచారుమతియే కోయదొరసానివేషము వైచికొని మువ్వలమ్ముచు నీరాజుగారి యంతఃపురముకరిగి రాజవుత్రికలు పెనుచుచున్న చిలుకలకుఁ గట్టించి మా యుద్యమము సఫలము జేయించినది. తరువాతివృత్తాంతమంతయు మీపౌరు లెఱింగినదియే కదా. మిమ్మును మీనగరస్థులను శ్రమపెట్టినందులకు మాతప్పులు క్షమింప వలయునని కోరుచున్నాను. అని చెప్పి హరివర్మ పీఠముపైఁ గూర్చుండెను.

అవృత్తాంతము విని సభ్యులెల్లరు నాశ్చర్యసాగరంబున మునింగిరి. పిమ్మట సోమదత్తుండు వారి నలువుర నగరిలోపలకుఁ దీసికొనిపోయి గౌరవించుచు హరివర్మ కిట్లనియె. మహావీరా! మీతమ్ములు మువ్వురు శుకరూపమున మాయంతఃపురములఁ బ్రవేశించి యందే