పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/224

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుమతికథ.

211

తించుచు మరణకృతనిశ్చయుండనై యుండ నమ్మహాత్ముదర్శనమైనది. అతనివలన నీమూలిక గ్రహించితిని. దాని సంపర్కంబున నీవు కలికి వైతివని నావృత్తాంతమాద్యంత మెఱింగించుటయు నాచంచలాక్షి సంతోష మభినయించుచు నాకిట్లనియె.

మహారాజపుత్రా ! నీవు నాకుఁజేసిన యుపకారమునకుఁ బ్రతి యేమియుం జేయఁజాల. క్షుత్పిపాసావ్యసనగ్రసితమగు పక్షిరూపము వాయఁజేసి తొంటిరూపు గలుగఁ జేసితివి. లేకున్న నాజన్మాంతము యీయడవులలో దిరుగవలసినదియేకదా. జీవితాంతముదనుక నీపాదసేవజేసి మీఋణము తీర్చికొనఁదలంచితిని. అందుల కంగీకరించితిరేని నన్నెత్తికొనివచ్చినయాసక్తంచరునిఁ బరమోపకారిగాఁ దలంచెదనని పలికిన విని నే నిట్లంటి.

తరుణీమణీ ! నేనీయపకృతి నీకుఁ జేయవలయునని చేసినది కాదు. యదృచ్ఛముగా నీ కుపచరించినది. అందులకు నీవునన్నింతగాఁ గొనియాడఁబనిలేదు. నిన్నుఁ బూవులఁబెట్టి తీసికొనిపోయి మీతలి దండ్రుల కప్పగించెదను. అందు నీనిమిత్తమై క్రమ్మఱ నీతండ్రి స్వయంవరము చాటించును. నీయిష్టమైనభర్తను వరింతువుగాక. ఇప్పుడనన్య గతికవని యాలోచింపవద్దు. ఇది కపటముగాఁ జెప్పిన మాటగాదు. యధార్ధవచనమని పలికితిని.

ఆచిన్నది నామొగముపై దైన్యదృష్టుల వ్యాపింపఁజేయుచు మనోహరా! పదిమాటలాడుటచే నాకు మీకడఁ జనువుజిక్కినది. మీమాటల కే నంగీకరించితిని. మీరుగూడ నాస్వయంవరమునకు వత్తురుగదా. అందు మిమ్మే వరించితిననుకొనుఁడు. సరిపడినదియా? మాటల కుత్తరముజెప్పలేని దానను గాను. నాయీవేషము నాఁటిదే. ఈదామము నాఁడు బూనినదే. త్రికరణములచేత నిదివఱకెవ్వరిని వరించియుండలేదు. దైవసాక్షిగఁ జెప్పుచున్నాను. మీనిమిత్తమే