పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/223

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సారి చూడుము తలోదరీ ! నీచిలుకపలుకుల నాచెవి సోకింపుము అని యేమేమో దుర్భాషలాడ వినిపించుకొనక నోటికివచ్చినట్లు వానిం దిట్టుచుఁ బెద్దయెలుంగున విలపించితిని.

నాలుక యెండి యెలుంగురాక తొట్రుపడుచుండ నాదానవుండు అయ్యయ్యో ! ప్రేయసీ ! వెక్కి వెక్కి యిట్లేల యేడ్చెదవు? శోకతాపంబున నీనాలుక యెండిపోయినదిగదా. తటాకజాలంబులం దెచ్చి యిచ్చెదఁ ద్రాగెదవా! అని పలుకుచు వాఁడాసరోవరములోఁ దిగి యేమిచేసెనో తిరుగా వాఁడు నాకడకు రాలేదు. ఎంతసేపటికి వాఁడు రాకున్న వెఱఁగుపడుచుఁ గన్నులెత్తి నలుమూలలు చూచితిని. ఎందును వానిజాడ గనంబడలేదు. ఆతటాకములోఁ గాలుజారి పడెనేమో యని తలంచితిని. ఏది యెట్లైనను నానాలుక యెండిపోవుచున్నది. నీరుత్రాగి తరువాత వానిసంగతి విచారింతమని తలంచి నేను మెల్లన జలాకరమున కరిగి జానుదఘ్నంబగు నీట నిలిచి చేతులతో జలోపరిభాగంబునందలి మలినంబు ద్రోయుచు మొగముగడిగి కన్నులఁ దుడిచికొని యంజలిచే రెండుగ్రుక్కలు నీరు ద్రావితిని. సౌమ్యా ! అంతలో నా దేహము చులకనై చిలుకనైపోయినట్లు కొంచెము జ్ఞాపకమున్నది. తరువాత నేమిజరిగినది తెలియదు. నాకీరూప మెట్లువచ్చినదియో దేవరయే చెప్పవలయును అనియాత్మీయవృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆకథ విని నేను మిక్కిలి యాశ్చర్యమందుచు రాజపుత్రీ ! నీ చరిత్రముకొంతమమ్ముఁబోలియున్నది. మాతమ్ములుమువ్వురీ చెఱువు నీరు త్రాగి నీపలెనే చిలుకలై యెగిరిపోయిరి. వారినిమిత్తమే నేనిందు గ్రుమ్మరచున్నవాఁడ. ఈతటాకాంతరమున నొకసిద్ధుండు తపంబుజేసికొనుచు జనసంబాధమునకు వెరచి యీనీరుత్రాగినవారు చిలుకలై యెగసిపోవుదురని నియమముజేసెను. నేను తమ్ములపోకకుఁ జిం