పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఒక్కసారినన్నుఁ బవిత్రుంజేయువాఁడుంబోలె నా దెసఁజూచి స్తుతివచనముల కేమి ? నీ కోరికయేదియో చెప్పుమని యడిగిన నేను దొందరపడుచు నేమికోరవలయునో తోచకనేను మా సోదరులతోఁ గూడికొని సుఖముగానింటికింపోయి తలిదండ్రులకు నమస్కరించునట్లనుగ్రహింపు డింతకస్న నధిక మేమియు నీయనక్కరలేదని కోరితిని. ఆ సిద్ధుండట్టెలేచి యేదియో మూలిక పెరికికొనివచ్చి నాకిచ్చి చేయఁ తగిన విధానము బోధించి పోపొమ్ము నీ తలంచినట్లగునని పలుకుచు నా యోగి గుభాలునం దటాకములో నుఱికి మునిఁగిపోయెను.

అయ్యోగి మూలమున నా కర్మసూత్రంబు బయటఁబడినదని సంతసించుచు నమ్మూలికను బదిలముగా మూటగట్టికొని చిలుకలనరయుచుఁ గ్రమ్మర నాశిఖరప్రదేశమంతయుఁ దిరుఁగఁజొచ్చితిని. చిలుకలు గనబడినను నేనుదాపునకుఁబోయినంత నెగిరిపోవుచుండునవి. చెట్ల శాఖలనున్న చిలుకల కీ మూలిక దగిలించుటయెట్లు ? అని యాలోచించి మట్టియుండలఁ గొన్నిటంజేసి పచ్చిగానున్న యామూలికబెరడు ఆయుండలో గలిపి కనంబడిన చిలుకకుఁ దగులునట్లు వినరుచుంటిని.

చారుమతి కథ.

ఒకనాఁడొక తరు శాఖపై నిలువంబడి మధురముగాఁ బలుకు చున్న యొక చిలుకంగాంచి పొంచి పొంచి దాపునకుంబోయి గుఱి జూచి యా మట్టి దాని పాదంబులకుఁ దగులునట్లు గొట్టితిని తత్సంపర్కంబు గలినంత.

చ. కలకల నవ్వునెమ్మొగము గంతుశరంబులఁబోలు సోగ క
    న్నుల వెలిచూపు లద్భుత తనూద్యుతి చక్కని కౌను తళ్కు, చె
    క్కులు మృదుపాదముల్ గులుకు గుబ్బలుగల్గి మనోహరాకృతిం
    చిలుక నెలంతయై నిలిచెఁ జెంగట విస్మయమాత్మఁదోపగన్.

నే నాయెలనాగం గాంచి వెరగుపాటుతో బోటీ! నీవెవ్వని కూఁతురవు?