పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/220

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివర్మాదులకథ.

207

దేవతా నివేదనము గావించి కొన్ని భక్షించెను.

నే నావింత కన్నులార జూచి యోహో! ఈమహాముని యెవ్వఁడో జలస్థంభనజేసి తటాకములో జపము జేసికొనుచున్నాఁడు. ఇప్పు డే కారణముచేతనో బాహ్యప్రచారముగలిగి బయటకువచ్చెను. ఇమ్మహాత్ముని జలచరమనుకొంటి నాసాపము శమించుఁగాక. నే నిప్పు డీతని చెంతకరిగి పాదంబులంబడి వేడికొనియెదను. కృపా దృష్టులు నాపై బరగించెనేని మనుష్యులలోనన్నుఁ బోలు పుణ్యాత్ముఁ డుండఁడు. ఇంతవఱకు నిష్ఫలమని తలంచిన మాప్రయాణము సఫల మగును. అలిగి శపించెనా కృతార్థుఁడనే యగుదును. అని తలంచుచు నంజలినున్న నీరుపారఁజిమ్మి మెల్లనలేచి కరయుగంబు శిరంబునంజేర్చి మందగమసంబున నవ్వలితటంబున కరిగి దూరంబునుండియు సాష్టాంగముగా నేలంబడి ప్రాకుచుంబోయి అతనిచరణ పంకజంబులం బట్టుకొంటిని అమ్మునిపతి యదిరిపడి యెవడవురా ! ఈవిజనస్థలంబున కెట్లువచ్చితివి ? తటాకజులంబులఁ గ్రోలలేదా ! అని యడిగిన నేనల్లన లేచి నినయ భయభక్తి విశ్వాసములు ప్రకటించుచు నిట్లంటి.

మహాత్మా! అతి పవిత్రములగు మీదృష్టి ప్రాసారములు నాపై వ్యాపింపఁజేసితిరి. నా పాపములు పటాపంచలైనవి. నేను గడుపుణ్యాత్ముండనైతి నాపురాకృత సుకృతములు ఫలించినవి. ఆహా! పామరుండనగు నేనెక్కడ! పరమహిమాస్పదంబగు నీ పరత్వ శిఖర మెక్కడ? దేవతలకైన పడయ శక్యముగాని మీ దర్శనమెక్కడ? నాకు నేఁడెట్టి సుప్రభాతమైనది! నా జన్మావధిలో నిట్టి శుభ వాసరములేదుగదా! ఇఁకనే జచ్చినను ధన్యుండనే. అని యనేక ప్రకారము లగ్గించుచు నా వృత్తాంత మంతయు సంక్షేపముగా నెఱింగించితిని మత్పూర్వకృత సుకృత విశేషమువలన నా నుడివిన నాలుగుమాటలు నెన్నినాళ్లకోగాని బాహ్యప్రచారమురేని యామహాయోగిచెవింబడినవి.