పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/218

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివర్మాదులకథ.

205

వమే మహానదులకులేదు. గంగాది తరంగిణులు సేవించిన వారికి మరణానంతరమునఁగాని ముక్తి నీయజాలకున్నవి. జలపాన మాత్రముననే సద్యోదేహవిముక్తి నిచ్చుచుంటివి. నీకు నమస్కారము నీ కిట్టి సామర్ధ్యమెట్లు వచ్చినదియో తెలుప బ్రార్థించుచున్నాను.

అని పలుకుచు నేదియో ధ్యానించుచుండ దత్తటంబున మేయుచున్న మా గుఱ్ఱములు నాలుగును దప్పిగొని తటాలునవచ్చి, యా చెఱువునీరు రెండు గ్రుక్కలు గ్రోలి చిలుకలై యెగసిపోయినవి. ఆమార్పుజూచి అయ్యయ్యో నేనెంత మఱపుజెందితిని. భ్రాతృవియోగశోక వేగంబున వీనిమాట మఱచిపోయితిని. మాతోఁగూడఁ గష్టసుఖంబు లనుభవింపవచ్చిన యోగుఱ్ఱములు తమ్ములలోఁ గలిసి పోయినవి, కానిమ్ము. ఎన్నిటికి విచారింతును ! తలిదండ్రులమాట వినని నిర్భాగ్యులిట్లే కష్టముల పాలగుదురు. వీరి యాకారములు మారుట కేదేని యాధారము దొరికిన సరే. లేకున్న సరస్తోయంబు లుండనే యున్నవి. మఱికొన్ని దినంబు లీకూటశృంగాట కంబున సంచారము గావించి చూచెదంగాక యని తలంచుచుఁ దత్ప్రదేశము లన్నియుం దిరిగి చూచుచు నందందు సంచరించు చిలుక గుంపుల దావునకరిగి తమ్ములారా ! అని పిలుచుచు బ్రతివచనంబు బడయక పూర్వ వృత్తాంతము దలంచుకొని దుఃఖించుచుఁ బదిదినము లతీకష్టము మీఁద వెళ్ళించితిని నాయరణ్య రోదనమునకు ఫలమేమియుఁ గనంబడ లేదు సీ! నేనువట్టి మూడుండనై యిట్లు తిరుగుచుంటి దైవము మమ్మిచ్చటఁ గష్టములుపాలు సేయఁదలంచెను. తదాజ్ఞ నతిక్రమింప నేనెంత వాఁడను ప్రారబ్ధశేషమున నా కీ పదిదినములు బ్రతికి శోకించుటఁకుఁగారణమైనది. నేను నాఁడెచిలుకనైతినేని యీశోకముండునా. ఇఁక నాకువేరొక తెరవులేదు. ఈ జన్మమున నాకన్నదమ్ములతోఁ గలియు భాగ్యముపట్టదు. వట్టియాస బెట్టుకొని తిరిగితిని.