పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/216

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివర్మాదులకథ.

203

గీ. భళిర మనమెప్పుడిట్టి పుష్పముల ఫలము
    లను సువాసనలను దేనెలను విచిత్ర
    లలిత పాదపదళలతాదులను జూచి
    యెఱుఁగమనుచు వచింతు మొండొరుల మేము.

అమ్మార్గంబున నదృష్టపూర్వములగు వృక్షలతాగుల్మాదుల నాలోకించుచు వింతలతాంతంబులఁ గోసి నాసాపర్వము గావించుకొనుచుఁబోయి పోయి.

క. జలవిహంగంబులు నళినీ
   దళములు మత్స్యములులేక తటముల నొరయం
   గల సలిలముతోఁ దగునొక
   కొలనుంగనుగొంటి మేము కుతుకంబమరన్ ?

పద్మినీజలచరనిహంగమ మండూకశూన్యంబగు తటాకంబు గాంచి పిపాసాలసులమగుటఁ దత్తటనికటంబున ఘోటకంబుల దిగి జీనులవిప్పి గఱికిమేయుటకై వాని విడిచి తేరవునడచిన బడలికబాయ జలక్రీడలాడఁదలఁచి గుభాలున నాజలాకరంబునంబడి మునిఁగి తేలుచు డప్పికి నిలువలేక మాతమ్ములుమువ్వురును దోసిళ్లతో నీరువట్టిమూడు గ్రుక్కలుగ్రోలుటయు నేను జూచుచుండ వారు మువ్వురు చిలుకరూపము దాల్చి గగనంబున కెగసి యుత్తరమార్గంబుగాఁ బోయిరి.

అయ్యనర్ధము గన్నులారజూచి నేను గుండెలు బాదుకొనుచు లేది యాచిలుకలుపోయినదారిం బరుగిడికొనిపోయి తమ్ములారా! నన్ను విడిచి పోవుచున్నా రా? నాదెస జూడరా? ఆప్రేమయంతయు నేమిజేసిరి? రండు రండు. చూఁడుఁడు. అని కేకలువైచుచు నవిపోయినదారిని కొంతదూరము పోయితిని. అంతలో నాచిలుక లదృశ్యము లై దూరముగాఁ బోయినవి. పక్షులతో నేను బోవఁగలనా? నిరాశజెంది పిమ్మటఁబోక మరలి తటాకంబునకరుదెంచి తచ్ఛిహ్నములఁ బరికించి