పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మహారాజా! మీప్రజలకు మావలననే యీయుపద్రవము తటస్థించినది. స్వకార్యసాధకమగు ప్రక్రియ ప్రమాదమున నన్యబోధక మైనను దోషము కానేరదను నార్యోక్తి ననుసరించి మాతప్పు క్షమింప వలయునని మీప్రజలను మిమ్మునుగూడ వేడుకొనుచున్నారము.

అట్లు జరిగించుటకుఁగల కారణము ముందు మీకు వివరింపఁ గలమని పలుకుచు నానృపతి ప్రార్ధన మంగీకరించి తద్దత్త సత్కారములందికొనుచు సోదరులతోఁగూడ నేనుఁగనెక్కి వారాంగనానృత్యగాన వినోదములతో జనపతిప్రముఖులు ముందు నడుచుచుండ మహా వైభవముతో నూరేగుచు నత్యంతాలంకార రమణీయమగు సభా మండపము జేరెను.

ఆవీరుల నలువుర రత్నసింహాసనములం గూర్చుండబెట్టి కొందఱు పూవులు జల్లిరి. కొందఱు గీతములం బాడిరి. కొందఱు పద్యముల రచించిరి. వారు పౌరులకుఁ గావించిన యుపకారము లుగ్గడించుచు విద్వాంసు లాశీర్వదించిరి. మాకత్యంతోపకారకులైన మీచరిత్రము విన సభ్యులు వేడుకపడుచున్నారని మంత్రిలేచి యుపన్యసించుటయు నందు హరివర్మ లేచి యెల్లరువిన నిట్లెఱిఁగించెను.

హరివర్మాదుల కధ.

నాపేరు హరివర్మయండ్రు. వీరు నాతమ్ములు. మాయన్న విద్యాసాగరుఁడు. మేము తాళధ్వజుం డను చక్రవర్తి బిడ్డలము. మే మేవుర ముత్తరదిగ్విజయము సేయఁ బయలుదేరి పెక్కండ్రరాజులఁ బాదాక్రాంతులఁ గావించి యంతటితోఁ దృప్తినొందక దిగంతము జూడవలయునని యౌవన మదంబున బయలుదేరి సేనలతోఁగూడ జన పదంబులం దాటి పెద్దదూరము మహారణ్యములో సంచారము గావించితిమి. మేమొకచో గుఱ్ఱములెక్కి పోవుచుండ నొక జంఝావాతంబు