పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/212

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మరాక్షసునికథ.

199

రాజు భార్యనూరడించుచు నావీరులెవ్వరో తెలిసికొనవలసియున్నది. అందులకు ఱేపు సభగావింపు చుంటిమి. వారిఁ బెద్దగా గౌరవింతుమని పలికిన విని రాజపత్ని వారికథ మాకుఁ జాలభాగము తెలిసినది. కోయదొరభార్య మనయింటనే యున్నది. అమ్మాయి దానివలననిజమంతయుఁ దెలిసికొనినది. పాండవులవలె వారు మారురూపులు ధరించి మన వీటికివచ్చిరి. అయత్నోపలబ్ధముగా మీకును మంత్రికిని సామంతరాజునకు నల్లుండ్రులభించిరి. ఆకథయంతయు నమ్మాయి చెప్పఁగలదని యేమేమో చెప్పి యతని కానందము గలుగఁ జేసినది.

తరువాత ప్రఫుల్లవచ్చి తండ్రితోఁ గొంతసేపు ముచ్చటించి చేయఁదగిన కృత్యము బోధించినది. మరునాఁ డరుణోదయంబున మంత్రిసామంత హిత పురోహితసహితముగాఁ తూర్యనాదములు భూనభోంతరాళఁబునిండ దాసదాసీ సహస్రములుగొల్వ నలంకరించిన భద్రదంతావళములతో బయలుదేరి సోమదత్తుఁ డామహావీరులున్న సత్రంబున కరిగెను. అందుఁ బౌరులు గుంపులుగావచ్చి తమ్ము దైవము లని స్తోత్రములు సేయ వారితో ముచ్చటించుచున్న యా వీరులు నల్వురు రాజుగారి రాక విని యెదురేగిరి.

రాజు దూరమునుండియే మోడ్పు చేతులతోఁ బోయి వారి పాదములమ్రోల సాష్టాంగముగా నమస్కరించుచుఁ దానుదెచ్చిన పుష్పమాలలు వారిమెడలోఁవైచి వినయముతో నిట్లనియె. మహా వీరులారా! మీచరిత్రము కొంత వినియున్నాఁడను. మీరు సత్కులప్రసూనులు, మీపరాక్రమము వేరే యుగ్గడింపఁబనిలేదు. మొన్న మీరు మాదేశమునకుఁగావించిన యుపకార మేతన్మాత్రమని నిరూపించి చెప్పఁజాలము. మీరుచేసిన మేలునకు గృతజ్ఞులమై మీనిమిత్త మొక సభ జేయుచున్నారము. అంగీకరించి యీభద్రగజమెక్కి రావలయునని సోమదత్తుఁడు ప్రార్ధించుటయు హరివర్మ యిట్లనియె.