పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/209

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నాకర్మము, ఆసాహేబు నేనాగుఱ్ఱముఁ దొంగిలించి తెచ్చితినని రచ్చకులాగికొని పోయి చెరసాలలోఁ బెట్టించెను. లంచము గొని నా దాయాదుల మువ్వుర జోలికిఁ బోడయ్యెను. చిలుక రాక్షసుఁడైనప్పుడు గుఱ్ఱమగుట యసత్యమగునా? తండ్రీ! నామాటనమ్మక నన్నన్యాయముగా బందీగృహంబునం బెట్టించినందుల కాతురక బాలిశునకు మంచి ప్రాయశ్చిత్త మైనదఁట. ఆరక్కసుని నోటఁబడెనని చెప్పికొనిరని దీనుండై తనయుదంత మంతయు విన్నవించెను.

సోమదత్తుఁ డావర్తకుని నూరడించుచు మంత్రితోఁ దరువాత నేమిజరిగినది. ఆమహావీరు లెక్కడినుండి వచ్చిరి. పిమ్మట నేమైనదని యడిగిన నతండిట్లనియె. మహారాజా! కొన్నిదినముల క్రిందటఁ గోయవాండ్రు మూడు కొండచిలుకల నమ్మదెచ్చిరంట. కొండ చిలుకలు గుజ్జురెక్కలతో నొప్పుచుఁ జూడ మిక్కిలి సొంపుగానుండును. వానిలో నొక దాని భర్తృదారికయు నొకదాని నాకూతుఁరు కాళిందియు నొకదాని సామంతరాజు కూఁతురు రుక్మవతియు గొన్నారఁట. మొన్న కోయవాడమ్మదెచ్చిన పైడిమువ్వలు మువ్వురుకొని తమ చిలుకలకుఁ గట్టించిరి. తత్సంపర్కంబున మూఁడు చిలుకలు మహావీరపురుషులై నిలువంబడినవి. అది యట్లుండ నామువ్వలమ్మం దెచ్చిన కోయవాఁడు వీధులం దిరుగుచుండగనే బోగముదాని చిలుక బ్రహ్మరాక్షసుఁడై యూరంబడి మహామారియుంబోలెఁ బ్రజల గసిమసఁగు. చుండుటయు నెఱింగి యాకోయవాఁడు రయంబున రచ్చలోనున్న చిలుక మార్పు హయంబు నొక్కదాని నెక్కి కరవాలంబు బూని యాదానవుని దరుమఁజొచ్చెను.

అంతకుఁ బూర్వమే యవన దండనాధుండు వానియలజడి విని కొందఱు వీరభటులతో నెదుర్కొని గడియలో వానిచే జంపఁబడియెను. దానంజేసి యుద్ధభటు లెవ్వరు వాని నెదుర్కొన వెఱచి