పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/208

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మరాక్షసునికథ.

195

మహారాజా ! నేనాఱుమాసముల క్రిందట నొక కొండవాఁడుచిలుకనమ్మదేగా మంచిపుట్టంబు లిచ్చి దానిఁగొంటిని. బంగారు పంజరములోబెట్టి మాటలు నేర్పి ముద్దుగా బెంచుచుంటిని. మూఁడుదినముల క్రిందట నొక కోయది చిలుకల కలంకారములని పైడిమువ్వలు దెచ్చి యమ్ముచుండెను. చిలుకయందలి ప్రేమచే నేనా మువ్వలం గొని మంచివేళజూచి దానికంఠమునకుఁ గట్టింపుచున్నంతలోనాచిలుక యొక బ్రహ్మరాక్షసుఁడై యఱచుచు నెదురునున్న నాదాదినిమెడఁ గరచి నెత్తురుపీల్చి చంపి. నాట్యముసేయుచుండెను. అప్పుడు నేను గదిలోఁ దూరి తలుపు వేసికొంటిని. లేకున్న నేనీపాటికిఁ బెద్దలలో జేరియుండుదాననే. పిమ్మటఁ జావడిలోఁ బండికొనియున్న మాయమ్మను నెమ్ములు విరుగజఱచి పరలోకగతంజేసెను. వీధిగదిలోఁ బండుకొనియున్న యొక భాగ్యవంతుని కుమారుని విటధర్మమునకై యరుదెంచినవాని మెడ జెఱుకుముక్కవలె విఱచి రక్తముద్రావెను. పాఱిపోవుచున్న నలువుర దాదులం దరిమి చంపినది. తరువాత మాయిల్లు విడిచి నడివీధిం బడినది. ఇంతవట్టు నేనెఱుంగుదు. స్వామీ ! మా తల్లిం బూవులలోబెట్టి పోషించుచుంటి. అట్టి మాతం గోలుపోయితినని గోలున నేడువఁ దొడంగినది.

ఓహో ! ఈచిచ్చు నీయింట బుట్టినదా ! కానిమ్ము. పెద్దది మీయమ్మ కేమి ? నీవు బ్రతికితివిగదా. పొమ్మని పలుకుచుఁ దరువాతి వృత్తాంతము జెప్పుమని యడిగినఁమంత్రియా సుబ్బి సెట్టి నెదురకు బంపెను. అతండు నమస్కరించుచు దేవానేనేపాపము నెఱుఁగను. నా యుసురా దండనాధుఁనకుఁ గొట్టినది. కొన్నిదినములక్రిందట మావర్తకులతో పాటు నేనొక చిలుకం గొంటిని. ఆమాయకోయసాని ఎక్కడినుండి వచ్చినదియో పైడిమువ్వలమ్మి పోయినది. నాచిలుకకు గట్టినఁ బెద్దగుఱ్ఱమైనది. దానివలెనే మాదాయల చిలుకలు గుఱ్ఱములైనవి.