పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/207

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గీ. పౌరులార! వెఱవఁబనిలేదు క్రవ్యాదుఁ
    డీల్గె నిందు నస్మదీయహస్త
    కలిత హేతిధారఁ గౌతుకమేపారఁ
    దిఱుఁగుడింక వీధితెరవులందు.

అని పలుకుచుఁ బౌరుల భయమువాపి యంతకుముందు హతశేషులైన పురరక్షుకుల కుదుటుగఱపి రాక్షసదేహంబు గాల్పుఁడని నియమించి “యావీరు లెవ్వరో భగవంతులై వచ్చి తమ్ము రక్షించిరని ” పౌరులు స్తుతియించుచుండ నాసత్రంబునకరిగి యొండొరుల వృత్తాంత మొండొరులకుఁ జెప్పికొని యానందించిరి. అని యెఱిగించి -

__________

229వ మజిలీ.

బ్రహరాక్షసునికథ.

అన్నగరాధిపతియగు సోమదత్తుండు వేటకుఁ బోయివచ్చుచు వార్తాహరులవలన నయ్యుపద్రవము విని నాఁటి సాయంకాలమున కే పురముజేరి యాయుత్పాతమునకుఁ బరితపించుచుఁ గోటలోనే చిన్న సభజేసి ప్రధానితో నిట్లనియె, అమాత్య శేఖరా ! మనవీట నెన్నడును నిట్టి విపరీతము జరిగియుండ లేదు. చిలుకలు గుఱ్ఱములగుటయు బ్రహ్మరాక్షసుఁడగుటయు మనుష్యులం జంపుటయు జాలవింతగా నున్నది. తంత్రవేత్త లెవ్వరైన వచ్ఛి నగరముపైఁ బ్రయోగము సలిపిరా ? ఆరక్కసుం బరిమార్చిన మహావీరు లెక్కడనుండివచ్చిరి? ఆవార్తయంతయు సవిశేషముగాఁ జెప్పుమని యడిగిన నామంత్రియంతకుమున్ను రప్పించియుంచిన బోగముదాని ముందుకుద్రోసి నీ వెఱింగిన కథ నీయింట నేమిజరిగినదియో చెప్పుమని యడిగిన నావేశ్య రాజునకు నమస్కరించి యిట్లనియె.