పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/205

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కాశీమజిలీకథలు - పదియవభాగము.

చెప్పినంగాని నిన్నిక్కడినుండి కదలనీయమని పలికినది.

అంతలో మఱికొందఱుపరిచారిక లుప్పరిగలెక్కి చూచి వచ్చి అయ్యో! అయ్యో!ఆ రాక్షసుఁడు స్త్రీల మీఁదఁబడి పరిభవించుచున్నాడు. వాని కెగరుటకు సామర్ధ్యముండుట గోడలు, కోటలు దాని నాటంక పెట్టఁజాలవు. కోయదొర గుఱ్ఱమెక్కి వానిం దరిమితరిమి కొట్టుచున్నాఁడు. పక్షివలె నెగసి వాని కందకున్నాఁడు. మీరందఱు లోపలకుఁబోయి తలుపులు వేసికొనుఁడు. వాఁడిందు రాఁగలఁడని చెప్పిన విని కోయదొరసాని అమ్మయ్యో నామగఁడే వాని దరుముచుండుట స్వామి ! వెంకటేశ్వరుఁడా! నాభర్తం గాపాడుమని ప్రార్థించినది.

అంతలోఁ నారక్కసుఁ డెగిరివచ్చి కోటలోబడి యల్లరిసేయుచుఁ గ్రమంబున రాజపుత్రికయున్న యంతఃపురమున కరుదెంచెను. అందున్న దాసీజన మాక్రందనము సేయుచుండెను. కోయది తటాలున నందున్న గదిలోదూరి తలుపులువైచికొన్నది. వాఁడు వచ్చి కాళిందిం బట్టుకొని యీడ్చుకొనిపోవుచుండెను.

రాజపుత్రిక మొఱ్ఱోయని యఱచుచు వారి వెంటబడినది. అయ్యాహాహాకారరవంబు లాలించి యాగదిలోనున్న కళాభిరాముఁ డీవలకు వచ్చి

క. కైదువు కైదువు తెండో
   యేదేనిం గలిగియున్న నిట వీనిశిర
   చ్ఛేదము గావించెద నిం
   ద్రాదిసురల్ ముదముజెంద నాహవకేళిన్.

అని పలికిన విని భద్రిక యందున్న కరవాల మొండు దెచ్చి వాని కిచ్చినది. అతం డది గైకొని యసురమీఁదికురికి,

క. నిలునిలుదై త్వా! యబలం,గలచెద వేమిటికి? రమ్ముకయ్యము సేయం
   గలవాఁడవేని నాఁతో, బలముం జూపించిపొమ్ము ప్రాణంబులతోన్.