పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/204

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకబ్రహ్మరాక్షసుడైనకథ.

191

లపై వింతలు వినంబడుచున్నవి. వీండ్రిచ్చిన మువ్వలు కోమటియింట నున్న చిలుకలకుఁ గట్టిరఁట. అవి గుఱ్ఱములైనవఁట. ఆవర్తకులాగుఱ్ఱముల నమ్మంజూపిన దొంగిలించిరని వారి నిర్భంధించి రాజపురుషులు చెరసాలం బెట్టించిరఁట. ఆమాటలు వింతగాఁ జెప్పికొనుచున్నారు. వింటిరా. అని చెప్పిన విని కోయది అమ్మా! అది యేవీధిని? చిలుకలు గుఱ్ఱములైనవియా నాలుగా అని సాభిప్రాయముగా నడిగినది. భద్రిక అవునని యుత్తరము చెప్పినది.

రాజపుత్రిక — దొరసానీ ! నీవు మాయావినివివలె నున్నావు. నీ వమ్మిన మువ్వలగట్టిన జిలుకలు గుఱ్ఱములేకాదు. మనుష్యులుగూడ నగుచున్నారు. ఇందలికారణ మేమియో చెప్పినంగాని నిన్నుఁ బోనీయము అని పలికిన విని కోయసాని అమ్మా ! ఏచిలుకయైన మనుష్యుడై నదియా ? తెలిసినఁ జెప్పుమని కోరినది. చెప్పిన నేమిచేయుదువని రాజపుత్రిక యడిగిన అమ్మా! మాతంత్రము సఫలమైనదని సంతసింతు మిదియ మాయభిలాష యని పలికినది. వారట్లు మాట్లాడు కొనుచున్నంతలోఁ బురములో గోలాహలధ్వని వినంబడినది. ఆయల్లరి యేమియో తెలిసికొనిరమ్మని రాజపుత్రిక భద్రిక సంపినది.

అది సింహద్వారముకడ కరిగి వచ్చి యురముపైఁ జేయిడికొని అమ్మయ్యో! బోగముదానియింటనున్న చిలుకకుఁ గోయలిచ్చిన మువ్వలు గట్టినతోడనే అదియొకబ్రహ్మరాక్షసుండై కనంబడినవారినెల్ల మ్రింగుచున్నాడఁట. జనులూరక పారిపోవుచున్నారు. కోటతలపులు వేయించివచ్చితిని. నయమే! మనచిలుక లట్లైనవికావు. అని చెప్పినది.

ఆమాటలు విని కోయది బాబో బ్రహ్మరాక్షసుండనిన నాకు మిక్కిలి భయము. వాడిక్కడికి రాడుగద అని వెఱపనభినయించుచున్నది. రాజపుత్రిక యీయింద్రజాలమంతయు నీవలనం గలుగుచున్నది. ఇంద్రజాలపింఛికవు నీవే వెఱచిన మే మేమందుము. నీవిఁక నిజము