పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పురుషు లేడ, అని విస్మయమందుచుఁ బ్రఫుల్ల సఖులారా! మీరు వారివృత్తాంతము లడిగితిరా యేమనిరనియడిగిన కాళింది యిట్లనియె.

సఖీ ! అడిగితిమి. ఒకఁడు సుధర్ముఁడఁట. ఒకఁడు సులోచనుఁడఁట. పేరులుమాత్రము సెప్పిరి. తమవృత్తాంతము కొంతచెప్పిరికాని యాపక్షిరూప మెట్లువచ్చినది యెఱుంగరు. నీచిలుక యేమన్నది మువ్వురు నన్నదమ్ములని తోచుచున్నది. అనుటయు ప్రఫుల్ల ఔను. నీవన్నమాట సత్యయే. మాచిలుకయు నట్లే చెప్పినది. నేఁడు కోయదాని గట్టిగా నిర్భందించి యడిగిన నంతయుం దెలియఁగలదు. మీచిలుకల నేమిజేసి వచ్చితిరి? ఎగిరిపోవుదుమని చెప్పలేదా. అని యడిగినది.

కాళింది సరిసరి ఱెక్కలువచ్చిన పక్షులు పోవుటకుఁ బ్రయత్నింపక నిలుచునా? బలవంతమున నాపితిమి మేము వేగఁబోవలయు నాకోయదానిం జూడవచ్చితిమి. దానిజాడ దెలిసినదియా? అని వారు దాపుననున్న పరిజనులకుఁ దెలియకుండ సాంకేతికముగా మాట్లాడు కొనుచుఁడ నింతలోఁ గోయదానిం దీసికొని భద్రిక యరుదెంచినది. మువ్వురు వింతగా దానిం జూచుచుండిరి. రాజపుత్రిక దానిఁ గూర్చుండనియమించి వీరె నాసఖురాండ్రు కేవలము నిన్నుఁజూచు వేడుకతో నరుదెంచిరి. నిన్న నీవు వత్తుననిచెప్పి రాక మాకాశాభంగము గావించితివి. నేఁడు నీచిలుకమగనిం దీసికొనివచ్చితివి కావేమి? అని యడిగినఁ గోయది యిట్లనియె.

అమ్మా! నామగఁ డింటికడఁ బనిగలిగి నిలిచెను. నేను నిన్న రాలేకపోయితిని. మీచిలుకలకు మామువ్వలు గట్టితిరా. వింతమాట లాడుచున్నవియా. అని యడిగిన వారు నవ్వుచు వింతలేకాదు. మనుష్యులవలె స్పష్టముగాఁ బలుకుచున్నవని చెప్పిరి.

అంతలో భద్రిక యవ్వలికిఁబోయి వచ్చి సఖులారా! వింత