పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గుఱ్ఱములున్న వారు. వారిళ్లు చూడండని సుబ్బిసెట్టి బోధించెను. ఆమాటలు విని యావర్తకులు మువ్వురు సుబ్బిసెట్టినిదిట్టుచు సాహేబు గారూ! మాయిళ్లు వచ్చి చూడండి. గుఱ్ఱములు కనంబడనిచో వీఁడు జుట్టు గోయించుకొనునేమో యడుగండని తెలియపరచిరి.

అట్లు వారు మాట్లాడుచుండగనే యమూడుగుఱ్ఱములు వీధి తిరిగివచ్చి సకిలింపుచు మొదటి గుఱ్ఱముకడవచ్చి నిలిచినవి. సుబ్బి సెట్టి సాహేబుగారూ! చూచితిరా? ఇవిగో వాండ్రగుఱ్ఱములు మీహడావిడి చూచి పెరటిమార్గమున విడిచివేసిరి. వారి పెరటిలోనికిఁ బోయి చూచిన వీని చిహ్నములు గనంబడును పదుఁడని ప్రబోధించెను. అప్పుడు సుబ్బి సెట్టి భార్య గుమ్మముమీఁద నిలువంబడి మగని నుద్దేశించి నీవెప్పుడు నిట్లే తెలివిమాలినపనులు సేయుచుందువు, తోడివారు పెరటిలోని గుఱ్ఱములఁ బెరటిదారి నవ్వలకు దోలివేసి యేమియు నెఱుఁగనివారివలె వచ్చి నిలబడిరి. నీవొక్కడవే దొంగతనము చేసినట్లు పట్టుపడితివి. ఈగొడవలు మన కేల ? నిజము చెప్పరాదూ ? దీని నెక్కడనైన నెత్తికొనివచ్చితివాయేమి. మనము చిలుకంబెంచితిమి. కోయమంత్రమువలన నది గుఱ్ఱమైనది. మావలెనే వారికిగూడ గుఱ్ఱములైనవికాని వారు వానిం దాటించిరి. ఆమాట సాహేబుగారితోఁ జెప్ప రాదా? ఊరక గందరగోళము జెందెద వేమిటికని మందలించినది.

దండనాధుఁ డామాటలు విని అరే ఏమిరా అది మాకీ అట్లు కూయుచున్నది. చిలుక ఘోడాసేస్తుందీరా ఏమి. మాకీ అదియేమిటీ పనికిరాదు. పదపద. రచ్చకు పద. అని ఆగుఱ్ఱములతోఁ గూడ సుబ్బి సెట్టిని న్యాయస్థానమునకుఁ దీసికొనిపోయెను,

అని యెఱింగించువఱకుఁ గాలాతిపాతమైనది. పై మజిలీయం దవ్వలికథ మఱియుఁ జెప్పందొడంగెను.

__________