పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లమ్మను. మీకడఁ జిలుకలున్నఁ దీసికొనిరండు. వానికిగట్టి వింతగా మాటలాడింతునని చెప్పిన విని సుబ్బి సెట్టి కోయదొరా! చిలుకలు మా బంధువులయిండ్లలోనున్నవి. వారికొరకే కొనఁదలంచితిని. లేకున్న మా కవసరమేల? అని యడిగినఁ దక్కినవారు నట్లే పలికిరి. అప్పుడు కోయదొర యాలోచించి కానిండు. మీరు తగవులాడవలదు. మీనలువురకు సమముగాఁ బంచియిత్తు. నిన్ననిచ్చిన వెలయే యిండు. మీబంధువుల చిలుకలకుఁ గట్టుఁడు. అని పలుకుచుఁ దనయొద్దనున్న మువ్వల వారికి సమముగానిచ్చి తగినవెలఁ దీసికొనియెను. కోయవాఁడు వెఱ్ఱివాఁడులోకజ్ఞానములేనివాఁడనివాండ్రు తలంచిమువ్వలు తీసికొనిపోయిరి.

తరువాత సుబ్బి సెట్టి వాని నేకాంతముగాఁజీరి, కోయదొరా! నీకుఁ జిలుకమంత్రమేనా గఱ్ఱముమంత్రలే మైనా తెలియునా ? అని యడిగిన నబ్బో! మాకుఁ జిలుకమంత్రములకంటె గుఱ్ఱపుమంత్రములే యెక్కువగాఁ దెలియునని చెప్పెను. మేమొక గుఱ్ఱమును దెప్పించితిమి. దాని సుడులు లక్షణము పరీక్షించి యెంతవెలచేయునో చెప్పఁగలవా ? అని యడుగుటయుఁ గోయవాఁడు సందియమేలా? నాకా గుఱ్ఱమునుజూపుము. గుణదోషము లెఱింగింతునని చెప్పెను.

అప్పుడు సుబ్బి సెట్టి కోయదొరను రహస్యముగాఁ దన పెరటిలోనికిఁ దీసికొనిపోయి పలుపుత్రాటిచేఁ గట్టి వేయఁబడిన యాజానేయమగు నొక గుఱ్ఱమును జూపించెను. దానింజూచి కోయవాఁడు సంభ్రమముతో దాపునకుఁబోయి జూలుదువ్వుచు మేనునిమురుచు ముద్దుపెట్టుకొనుటయు నది హేషారవము చేయుచు నతని ముట్టెతో మూర్కొనుచుండెను.

సుబ్బి - కోయదొరా! ఈగుఱ్ఱము లక్షణములు పరీక్షించితివి గదా. మంచిదేనా?

కోయ - సెట్టిగారూ ! దీని మీరెక్క నుండి తెప్పించితిరి ?