పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/195

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కోయది వచ్చినప్పుడు కబురుచేయుమనిరి. మనచిలుక కా మువ్వలు గట్టితివా ! అని యడిగిన నయ్యువతి నవ్వుచుఁ గట్టితినికాని నీవు పెందలకడబోయి యా కోయసానిం దీసికొనిరావలయును. దానితోఁ జాల మాటాడవలసియున్నది. ద్వారముకడ వేచియుండుము పొమ్మని నియమించుటయు భద్రిక వల్లెయని యల్లన సింహద్వారముకడకుఁ బోయి కోయదానిజాడ నరయుచుండెను.

అంత కొంతసేపటి కొక కోయదొర చిలుకను బుజముపై నెక్కించుకొని చిలుకమువ్వలో యని యరచుచుఁ వీధింబడి వచ్చు చుండెను. భద్రిక వానింజీరి, కోయదొరా! నిన్ననొక కోయసాని యీలాటి మువ్వలే యమ్మఁదెచ్చినది. దాని నీవెఱుంగుదువా? అది నీకేమి కావలయునని యడిగిన వాఁడు అది నాపెండ్లామే. నేఁడు పని యుండి బసలో నిలిచినది. పైడిమువ్వ లేమైనం గొంటిరా ? చిలుకలకుఁ గట్టితిరా ? అని యడిగిన భద్రిక యిట్లనియె.

అయ్యో ! నేఁడా కోయదిరాలేదా ! దానికొఱకే యిందు వేచియుంటిని. నిన్న మాయంతఃపురమునకు వచ్చి చాలమువ్వ లమ్మినది. వానివెల నింకను నియ్యలేదు. నేఁ డుదయముననే వత్తునని చెప్పిపోయినది. మారాజపుత్రి క దానితోఁ ముచ్చటింపఁ జాలవేడుకపడుచున్నది. మంచి కానుకలీయఁ గలదు. ఇంటికిఁబోయి తీసికొని వత్తువా ? అని యడిగిన వాడు సానీ ! నేఁడువచ్చుటకు తీరికలేదు. రేపు ప్రొద్దున దప్పక పంపువాఁడ. నిందే వేచియుండుము అని పలుకుచు నాకోయదొర యవ్వలకుఁ బోయెను.

భద్రికయుఁ జిన్నవోయిన మొగముతోఁబోయి రాజపుత్రికతో నావార్త చెప్పినది. దాని మగని చక్కఁదనము పెద్దగా నామెయొద్ద నభినందించినది. ఆమాటలు విని రాజవుత్రిక, అయ్యో ! వానినిందు దీసికొని రాలేకపోయితివా ! అడవివాండ్రకడ మనకు( ఘోషా) యవ