పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకలుగుఱ్ఱములైనకథ.

181

కున్నది. మాసోదరుల మాట జ్ఞాపకములేదు. అదియొక యింద్రజాలమువలెనున్నది. నావృత్తాంతము నాకు లెస్సగాఁ స్ఫురణకు రాకున్నది. ఈశుకరూపము నాకెట్లువచ్చినదో తెలియదు. నేనాకొండవాని చేతి కెట్లు వచ్చితినో తెలియదు. కోయది యిచ్చిన మువ్వలు గట్టినంతనే నిజరూపము దాల్చుట చిత్రముగానే యున్నది. ఆపుణ్యాత్ము రాలెవ్వతియో తెలిసికొనవలయు. దానియునికి యెందున్నదియో చెప్పుము. పోయి తెలిసికొని వచ్చెదనని యడిగిన నమ్ముదిత ముదిత హృదయయై యిట్లనియె.

సౌమ్యా ! మీరందుఁ బోనక్కరలేదు. మాకు మువ్వలిచ్చి పోయిన కోయది రేపుప్రొద్దున యిక్కడికి రాఁగలదు దాని కింకను వీనివెల యీయలేదు. దానివలన మీవృత్తాంతము తెలిసికొనవచ్చును. అంతదనుక భద్రముగా మీరిందు వసింపుఁడు మీ కే కొఱంతయునుండదు. మీరు కళాభిరాములు గదా. అన్ని విధములఁ బూజ్యులే. మాయతిధిసత్కారములఁ గైకొనుఁడని పలుకుచు నపూర్వోపచారములచే నారాధించుచు సుధు రాలాపములచే నతనిహృదయము గరుగఁజేసినది. అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. తదనంతరోదంత మవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

__________

227 వ మజలీ.

చిలుకలుగుఱ్ఱములైనకథ.

మఱునాఁ డుదయకాలంబునఁ భద్రిక రాజపుత్రికయొద్దకు వచ్చి భర్తృదారికా ! రాత్రి నీదర్శనమే యైనదికాదే. లోపలగదిలో నేమిచేయుచుంటివి? ఆమువ్వలు తీసికొనిపోయి కాళిందీరుక్మవతుల కిచ్చితిని. తమచిలుకలకుఁ గట్టెదమని చెప్పిరి. మఱియు ఱేపా