పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/192

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుక చిలుకపురుషుఁడైనకథ.

179

వేయుటకు శంకించుచుఁ బలువిధంబుల నాలోచించుచుండెను. మఱియు నాయూర నామెకుఁ గాళిందియు రుక్మవతి యను సఖురాండ్రిరువురుగలరు. కొన్నిమువ్వగుత్తులిచ్చి భద్రికను వారికడకుఁ బంపుచుఁ గోయదాని వృత్తాంతమంతయు జెప్పి యామువ్వల వారుపెంచుచున్న చిలకలకుఁ గట్టమనుము. అది వచ్చువేళకు వారింగూడ నిందు రమ్మని చెప్పుమని నియమించుటయు భద్రిక మువ్వగుత్తులందీసికొనిపోయి వారికిచ్చి యాసందేశ మెఱిఁగించినది.

ఈలోపల రాజపుత్రిక కొన్నిమువ్వగుత్తులఁ దీసికొని పంజిరమునొద్దకుఁబోయి యందున్న రామచిలుక నీవలకుఁదీసి ముద్దాడుచుఁ గీరరాజమా! నీకలంకారములు గొంటిమి తాల్తువా! ఒకపద్యము పాడుము. నీముద్దుపలుకులు విన వేడుకకలుగుచున్నది. ఎప్పుడు మౌనమే వహింతువు. అని పలుకుచు నామువ్వల మెడకును గాలికినిఁ గట్టుచుండ గుభాలున నాకీరము పురుషుండై నిలువంబడియె. రాజపుత్రిక జడిసికొని అమ్మయ్యో! అని యఱచుచు నేలంబడి మూర్ఛవోయినది.

ఆపురుషుం డాపూఁబోడిపాటు తెలిసికొని నలుమూలలు సూచుచు నయ్యో! ఈచిన్నది యెవ్వతియో తెలియదు. నన్నుఁజూచి వెఱచిపడిపోయినది. నేనిక్కడి కెట్లువచ్చితినో యెఱుంగను. ఈభవనము శుద్ధాంతమువలె నున్నది, మాసోదరులేమైరి. నేనిద్రబోయితినా. మేమాగిరికూటమెక్కి చెరువులో స్నానముచేసితిమిగదా. తరువాత నేమిజేసితిమో జ్ఞాపకములేదు. ఇది నాకు స్వప్న మాయేమి? నేను కళాభిరాముఁడనే అంతయు నీ కాంత నడిగెదంగాక. అని వితర్కించుచున్నంత నయ్యింతియు నొక్కింతసేపు మైమఱచి యట్టె లేచినది. అభినవమదనుండోయన నొప్పుచున్న యప్పురుషుంజూచి మోహపరవశయై హృదయము దృఢపరచుకొని నమస్కరించుచు నిట్లనియె.