పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/190

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకమువ్వలకథ.

177

ప్ర - నీకుఁ బిల్లలా?

కో - నేనే పిల్లను. నా కేటి పిల్లలు?

ప్ర - నీమగనికి నీయందిష్టమేనా?

కో — ఇష్టము కా కేమి? ఇదిగో నామగఁడు సంతతము నా నెత్తి పైనుండును.

ప్ర - ఈచిలుక నమ్మెదవా?

కో — అమ్మా! ఈచిలుక నామగఁడని చెప్పుచుండ నమ్మెదవా యని అడుగవచ్చునా ?

ప్ర - సానీ ! నీవు నిజము చెప్పక దాచుచున్నావు గదా.

కో - లేదు తల్లీ ! లేదు నిజమే చెప్పితిని. ప్రొద్దుపోయినది చిలుకం దెప్పింపవా ? పోవలయును.

ప్ర - సానీ ! నీ కీతొందర యేల. నీమువ్వలన్నియు నీవు చెప్పిన వెలయిచ్చి నేనే కొనియెదను. నీవు వీనినమ్ముట కిఁక మఱియొక వీధికరుగ నవసరములేదు. పోవలసియున్న రాత్రి భోజనముసేసి పోవుదువుగాని నీమగఁడు నీవెంటనే యున్నాడుగదా ? ఏవి ! నీబుట్టలో నెన్నిమువ్వగుత్తులున్నవి యో చూపుము. అన్నియుం దీసికొందుము.

కో - అమ్మా ! మీయొద్ద నొక్కచిలుకయే యున్నదఁట. అన్నిగుత్తులు నేమిసేసికొందురు. ఇదిగో యీగుత్తుమాత్రమే మీకిచ్చుచున్నాను. మీరే దాని కాలికిం గట్టుడు. నేను పోయివచ్చెద.

ప్ర - సరిసరి. అదియా నీయభిప్రాయము. మాయింటఁ జాల చిలుకలున్నవి. ఇవికాక మామంత్రికూఁతురు పినతల్లికూఁతురుగూడఁ జిలుకలం బెంచుచున్నారు. మాకు చాలగుత్తులు కావలసియున్నవి. అన్నియు నీయవలసినదే.

కో - అట్లైన వీనినన్నిటిఁ దీసికొనుఁడు. నాకు సెలవిండు పోయివచ్చెద.