పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/189

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మీయింటఁ జిలుకలున్నవఁట చూపుఁడు వేగఁ బోవలయు.

ప్ర - కోయసానీ! కొలదిదినములక్రిందట మేమొక కొండ చిలుకం గొంటిమి. అది పండ్లుతినదు. మాటలాడదు. బగబెట్టుకొన్నది కాఁబోలు దానికి మాటలు నేర్పుము నీకు మంచి పారితోషిక మిప్పింతును.

కో - మామువ్వలంగొని చిలుకలకుఁ గట్టుటయేమాకుఁ బారితోషికము. అమ్మా! ప్రొద్దుపోయినది. ఏదీ! మీచిలుక నిటుతెప్పింపుఁడు. మువ్వగుత్తికట్టి పలికించి పోయెదను.

ప్ర - కలికీ ! చిలుకపలుకులకన్న నీపలుకులు విన ముచ్చటగా నున్నవి. మాయింటఁ గొన్నిదినములుందువా? నీకు మంచిపుట్టములు వస్తువులు దాల్చ నిప్పింతును.

కో - అమ్మయ్యో! మే మొరులపుట్టములు గట్టము. ఈరేయి నిందుండిన మాజట్టువాండ్రు శంకింపరా? చీకటిపడువేళ యగుచున్నది. తల్లీ! చిలుకం జూపవా! నేనింటికిఁ బోవలయును.

ప్ర - అబ్బా! సానీ, ఊరకపోయెదనని తొందరపడియెదవేల చీఁకటిపడిన సాయమిచ్చి పంపుదునులే. నీతలిదండ్రు లెందున్న వారు! ఇందువచ్చిరా?

కో - ఇందురాలేదు. వా రేదేశమో పాలించుచున్నారు. ఎందున్నారని చెప్పుదును?

ప్ర - కోయతా! మఱియొకమాట యడిగెదఁ జెప్పుము. మీ కులములోని యాఁడువారందఱు నీవలెనే యుందురా?

కో - అమ్మా! ఆమాట నే జెప్పఁగలనా! మీవంగడమువా రందరు మీవలె నుందురేమో చెప్పగలరా?

ప్ర - అబ్బో! కోయసాని గడుసుదియే. ఏమోయనుకొంటిని.

కో - అమ్మా! అడనివాండ్రము గడుసుఁదన మెట్లువచ్చును?