పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/188

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకమువ్వలకథ.

175

నిలిపివచ్చితిని. మనచిలుకం జూపింత మక్కాంతం దీసికొనిరానా? యని యడుగుటయు నవ్వుచు నారాజవుత్రిక భద్రికా! దీనికింత యుపన్యాసమేల ? వేగఁబోయి తీసికొనిరమ్మని యజ్ఞాపించినది. అది వోయి తృటిలో నాకుటిలాలకం దీసికొనివచ్చి రాజపుత్రికముందు నిలిపినది.

ప్రఫుల్ల యప్పల్లవపాణిసోయగ మాపాదమస్తకము విమర్శించి చూచుచు నాశ్చర్యపడి కూర్చుండ నియోగించి,

ప్రఫుల్ల - కోయెతా! నీపేరేమి?

కోయెది – నాపేరు కామాచ్చి.

ప్ర - నీకాపుర మేయూరు ?

కో - అమ్మా! కొండవాండ్రకు నొకచోఁ గాపురముండునా? అన్నియూళ్ళు మా కాపురములే.

ప్ర - నీకుఁ బెండ్లియైనదియా?

కో -- మాకుఁ బెండ్లియేమిటి ? మగని వరించుటయే పెండ్లి.

ప్ర - పోనీ నీవు మగని వరించితివా ?

కో - ఈచిలుకయే నామగఁడు చిలుకయే దైవము చిలుక మూలముననే యీయేసము. మాకులమునకుఁ జిలుకయే జీవము చిలుకనే వరించితిని.

ప్ర -- బోటీ! నీమాటలు మాకుఁ దెలియలేదు. మీకు జిలుకవలవ జీవనమంటివి లెస్సయే చిలుక మగఁడెట్లగును?

కో — అమ్మా! కోయమాటలు కొండమాటలుమీకెట్లు తెలియఁగలవు ? మగఁడనఁగా నెవ్వడు ప్రాణమిచ్చునో వాఁడే మగఁడు. నేను జిలుకను. నాకీచిలుక మగఁడు.

ప్ర - కోయెతో! నీవు నిజముచెప్పక కపటముగా మాట్లాడుచుంటివిగదా.

కో — అమ్మా! కోయవాండ్రకుఁ గపటములు దెలియవు.