పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/186

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకమువ్వలకథ.

173

యుండుటంబట్టి యెన్నఁడును గట్టియలకైన బౌరు లాకొండయెక్కరు. ఎక్కకుండ నధికారులుగూడఁ బెద్దప్రహరి పెట్టించిరి.

సోమదత్తుడనురాజు ఆదేశమును ధర్మంబునఁ బాలింపుచుండెను. గోపురద్వారమునఁ గావలియున్న యధికారులయనుమతిలేక చీమకైన నావీటిలోఁ బ్రవేశింపశక్యముకాదు. ఒకనాఁడావీటి నడివీధినుండి

క. పలురంగుల పూసల భూ
   షల మేనందాల్చి లలిత సమధిక తేజః
   కలిత యొక కోయనెలఁతుక
   చిలుకం దలదాల్చి ప్రీతి చెలువారంగన్ .

మాటలం బలికించి ముద్దువెట్టుకొనుచు బైడిమువ్వగుత్తులుగల తట్టఁ జంక నిడికొని చిలుకమువ్వలు చిలుకమువ్వలో యని కేకలు వెట్టుచు రాజమార్గంబునఁ దిరుగఁజొచ్చినది. పౌరు లాధ్వనివిని దాపునకుం బోయి యయెలనాగసోయగమున కచ్చెరవందుచు నీదే కులము ? నీ పేరేమి ? ఈమువ్వల వెల యెంత ? నీ మగఁ డెవ్వఁడు? అని యడిగిన కోయస్వరముతో భాబులార? మేము కోయవారము. కొండవాండ్ర కులగోత్రములతో మీకేమిపని? కావలసిన మువ్వలం దీసికొనుఁడు వీనివెల కొంచెమే కాని ఫల మధికముగానుండును. ఈ మువ్వలు గట్టినంత మాటలు రాని చిలుకలైనను వాచాలముగాఁ బలుకఁగలవని యెఱింగించినది.

అచిన్నది మాటాడినంజాలునని కొందఱు గోవాళ్లుతమకక్కర లేకున్నను మువ్వల బేరమాడి కొనుచుండిరి. కొందఱు మాయింటికి రమ్ము మువ్వలం గొనియెదమని కేకలువేయుచుందురు. చిలుకలున్నవారికేగాని యీమువ్వ లమ్ముటకు మాయజమానుని సెలవులేదు. అని పలుకుచు సందుగొందులకుఁ బిలిచినను బోవక యాకోయత. నడివీధింబడి తిరుగుచుండెను.