పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/184

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమద్వరకథ.

171

దినములలోఁ దెలియగలదు, పొమ్ము. మేడమీఁదకుఁ బొమ్మని యలుకతో నుత్తరము జెప్పినది.

ప్రమద్వర యతని చేయిపట్టుకొని సఖీ! రమ్ము రమ్ము. ఈ ముసలిదాని మాటలు లెక్కసేసికొనకుము. మేడమీఁదకుబోయి సంగీతము పాడుకొందము. రమ్మని పలుకుచుఁ దీసికొనిపోయినది.

శ్రీనగరంబున శ్రీవర్ధనుఁడు ముసలిదిపంపిన పత్రికం జదివికొని గుండెలు బాదుకొనుచు నేలంబడి మూర్ఛిల్లెను. నికటమున నున్న యతనిభార్య యాపాటుఁజూచి యడలుచు శైత్యోపచారములు సేసి యెట్ట కే దెప్పరిల్లఁ జేసినది. అయ్యయో! నాప్రయత్నమంతయు వ్యర్ధమైపోయినదిగదా! ఏమిచేయుదును. వివాహముహూర్తము సమీపించుచున్నది. వసుప్రియుఁ డీపెండ్లికిఁ పెద్దప్రయత్నము చేయుచున్నాడు. హా! దైవమా! నాకెట్టి యపకారము గావించితివి? అని యూరక దుఃఖించుచున్నఁ జూచి భార్య యిట్లనియె.

ప్రాణేశ్వరా! బిడ్డదగ్గఱనుండి విపరీతవార్తయేమైనవచ్చినదా? అమ్మాయి కుశలముగ నున్నదియా? వేగము చెప్పుఁడని యడిగిన నతండు కన్నీరు దుడిచికొనుచు నిట్లనియె. ప్రేయసీ! మనుష్యప్రయత్నము లెప్పుడు వృధలు. వృధలు. ప్రమద్వరను బురుషశబ్దము వినకుండ నరణ్యములోఁ గోటలో నునిచి కాపాడుచుంటిని. ప్రమాదమునఁ బురుషు లెవ్వరైన నందు జేరినచో స్త్రీలుగానే కనంబడుచుండునట్లు సిద్ధులవలనఁ వరములందితిని. అదియేముప్పైనది. స్త్రీలుగానే కనంబడుదురనుటకంటె స్త్రీలగునట్లు చేయుమని కోరిన నీప్రమాదము జరుగకపోవును.

గుఱ్ఱముతోఁ గోటదూకి యెక్కడనుండియో రాచకుమార్తె యొకతె లోపలఁ బ్రవేశించి ప్రమద్వరతో మైత్రి జేసినదఁట. ఇరువురు నేకశయ్యాగతులై క్రీడించువారఁట. ఇఁకఁ జెప్పవలసిన దేమున్నది?