పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/183

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నేనాఁడుదాననుగాక మగవాఁడ నెట్లగుదును? మీరంత తెలియనివారా? విమర్శించి మాట్లాడుమని యుత్తరమిచ్చెను. నీవు పైకాఁడు దానివలెనే కనంబడుచుంటివి. తక్కినవిషయ మెవ్వరెఱుంగుదురు? ఎట్లైననేమి? యిప్పుడు నాశిరచ్ఛేదము కాఁగలదు. ఈభారమంతయు నాశిరంబునఁ బెట్టి యారాజు దూరమందున్న వాఁడు. ఇప్పుడు నేనేమి చేయఁదగినది? ప్రమద్వర గర్భవతి యైనది. అక్కడ పెండ్లి ప్రయత్నములు సేయుచున్నారు. ఈవార్తవినిన నాయిద్దరి చక్రవర్తుల మనోరధములు వ్యర్ధములై పోవునుగదా! వారిక్కడికి వచ్చి యపరాధుల దండింపకుందురా! అని కినుకతో శోకముతో విస్మయముతో నేమేమో పలికినవిని యతం డిట్లనియె.

అవ్వా! నీవిప్పు డీవార్త మీరాజునకుఁ దెలియఁజేయుము. అతండువచ్చి పరీక్షించుఁగాక. నేనాడుదాననై తినా నాదోషము లేదు గదా. మగవాఁడనైతినేని యప్పటికిఁ దగినట్లు చేయఁగలవాఁడ. ఇందులకు చింతయెందులకు? అనుటయు నాయవ్వ ఔను నీవెంత వాఁడవు గాకున్న నీశుద్ధాంతమునకువచ్చి పగలెల్ల నాఁడుదానవై రాతిరి మగవాఁడ వగుదువా? మారాజపుత్రిక నాతో నిజముచెప్పినది. నీబొంకులు నిలువవు. కానిమ్ము. ఆరాజువచ్చి యడిగిన నిట్లే చెప్పుము. అని బెదరించుచు నప్పుడే యొక పత్రికవ్రాసి కోటతలుపులు తీయించి యవ్వల నిగూఢముగానున్న భటునిచే నాపత్రిక శ్రీవర్ధనునొద్ద కనిపినది.

ప్రమద్వర, ముసలిది తన నెచ్చెలితోఁ గలహించుచున్నదని విని సఖులతో నచ్చటికిఁబోయి అవ్వా! నీతగవేమియో నాకుఁ దెలియకున్నది? ఆమెతోఁ బోట్లాడుచుంటివఁట ఏమిటికి? ఆమె ఏమితప్పు జేసినది. నీగొడవ యేమియో నాఁకుదెలియదు. చెప్పుమన్న జెప్పవు? నేనేమి జేయుదును? అని యడిగిన ముసలిది అంతయు నీకు నాలుగు