పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/181

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కాశీమజిలీకథలు - పదియవభాగము.

విని యావృద్ధ మెల్లగా నామెయున్న గదిలోనికింబోయి మంచముపై గూర్చుండి, అమ్మా! ప్రమద్వరా! పండుకొంటివేల? నీయొడలిలో నారోగ్యముగా నున్నదియా? అని మీదఁ జేయివైచి రాచుచు నడిగిన నదరిపడిలేచి యాచిగురుఁబోఁడికన్నులు నులిమికొనుచునామెకు నమస్కరించి కడుపులో వికారముగానుండ నిప్పుడే పండుకొంటి నీవు వచ్చి యెంతసేపైనది? అయ్యో! తెలిసికొనలేక పోయితినే అని పలికిన నామె కావృద్ధ యిట్లనియె.

పుత్రీ! నీకిప్పుడు నాతోఁ బనియేమున్నది? క్రొత్తస్నేహితులు వచ్చి ముచ్చటింపుచుండఁ బ్రాతవారిమాట జ్ఞాపకముండునా? పది దినములనుండి నిన్నుఁ జూడవలయునని తలంచుచు నీమేడ లెక్క లేక యిప్పటి కతికష్టముమీద వచ్చితిని. నీవు నన్నెప్పుడైన నిన్నినాళ్లు చూడకుండనుంటివా? క్రొత్తగొడవలోఁ బడిపోయితివి. పోనిమ్ము, వికారమేమి? ఏదీ! వెలుఁగునకు రా? బరీక్షింతు నని పలుకుచు ద్వారము దాపునకుఁ దీసికొనిపోయి పరిశీలించినది.

గీ॥ మోము తెల్లనయ్యె ముగుదకుఁ బాలిండ్లు
     వలములయ్యె కొనలు నలుపుఁజెందె
     మేనికాంతి వింతమెఱసెఁ బిరుందులు
     బలసె నడల మాంద్య మలరె సతికి॥

ఆలక్షణంబులు బరీక్షించి యావృద్ధ యుదరముపైఁ జేయివైచికొని, అమ్మయ్యో! కొంపమునిఁగినది. ఆక్రొత్త మగువ మగవాడు కాఁబోలు. నాఁడురూపునవచ్చి యిచ్చిగురుఁబోడిని మోసపుచ్చె. అక్కటా! నేనేమి సేయుదును? ఈవార్తవినిన రాజు నాకు శిరచ్ఛేదము సేయింపఁడా! ముందునెలలో వివాహముహూర్త ముంచితిమని నిన్ననే, శ్రీవర్ధనుఁడు వార్తనంపియున్నాఁడు. అని పలుకుచు గుభాలున నేలంబడి మూర్ఛవోయినది. ఆవార్తవిని పరిజనులందఱు వచ్చి,