పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమద్వరకథ.

165

లంచి కొంతసేపు సఖులచే వీణమీఁద బాడించినది. తానును గొంతసేపు పాడినది. రాజపుత్రుఁ డందలిలోపంబు లుగ్గడించుటయు వెఱఁగు పడుచుండ నాబిడ బోఁటీ! నీవు లెస్సగాఁ బాడఁగలవని తోచుచున్నది. ఏదీ యీవీణనందుకొని మంచిరాగము లాలాపింపుము అని యొకవీణ నతనిచెంత నునిపించినది.

అతండావీణయందలి లోపంబులం దెలుపుచు మెట్ల సవరించి చీలల బాగుఁజేసి తంత్రులమ్రోగించి మెఱుఁగు దుడిచి యద్భుతముగా మేలగించి మహామోహజనకంబులగు రాగంబులం బాడి యందుఁగల చేడియలనెల్లఁ బరవశలం గావించెను.

వైణికమహామహోపాధ్యాయుఁడని బిరుదునొందిన నారద మహర్షి రూపాంతరయగు సౌభాగ్య సుందరిచే శిక్షింపఁబడిన విద్యాసాగరుని వీణగానము విని యందలికాంతలు మోహాక్రాంతస్వాంతలై రనుట యబ్బురముకాదు. తద్గాన మభూతపూర్వము, అశ్రుత పూర్వమునగుట నెట్టివారిని రాగవ్యాప్తులం జేయకమానదు.

ఆగానము విని ప్రమద్వర లేచి గంతులువైచుచు నతని గౌఁగలించుకొని మోము ముద్దుపెట్టుకొనుచు ముద్దియా నీ వీగాన మెందు నేర్చికొంటివి? నాచే నిట్లు పాడింపఁగలవా? ఏదీ ఆమోహనరాగము మఱియొకసారి పాడుము అని సంభ్రమోద్వేగంబున మీఁదఁబడిగడ్డముబట్టికొని బ్రతిమాలు కొనియెను. అత్తఱి నతని చిత్త మెట్లుండునో విమర్శింపవలసియున్నది. క్రొత్తది, యౌవనవతి, రూపవతి, విద్యావతి యగుయువతి వచ్చి పైఁబడిన యప్పుడు కుసుమశరాసనవిలాస లాలసుండుగాకుండుట కతండు శుకుఁడా భీష్ముఁడా హనుమంతుఁడా! ఆమె దేహసంపర్కంబున సతనికిని నతతి దేహసంపర్కంబున నామెకును ననిర్వాచ్యమైన యానందముతోఁ గ్రొత్తవికారములు చిత్తంబులం బొడసూపినవి.