పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/176

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమద్వరకథ.

163

డును నీసుకుమారిం బెండ్లియాడుట కుఱ్ఱూటలూగు చున్నాడఁట. ముందరి వసంతములో వీరికి వివాహముఁకాగలదునీవు క్రొత్తదానవు గావున నింతచెప్పవలసి వచ్చినది.

మఱియు నీరాక మాకాశ్చర్యము గలిగించుచున్నది. మాకోట సింహద్వార మెప్పుడు మూయఁబడి యుండును. నా సెలవులేనిదే తెఱచుటకు వీలులేదు. నీవిందుల కెట్లువచ్చితివో నీవృత్తాంతము చెప్పవలసియున్నది. మారాజవుత్రికకు నీయందింత ప్రేమ యెట్లుకలిగినది యో! యెఱింగింపుమని యడిగిన నతండు వెండియుఁ దనయవయవములు చూచుకొని పురుషుఁడుగానే యుండుట దెలిసికొని ఔరా! “ఇంతకధజెప్పిన యీ ముసలిదికూడ నన్నాఁడుదానిగానే సంబోధించినది. కానిమ్ము. ఇదియునుపకారమైనది. నేనుగూడఁ గపటముగానే మాట్లాడెదనని తలంచి " యామెకిట్లనియె.

అవ్వా ! నారాక మీకు విచిత్రము కలుగఁజేయకమానదు. మాది దక్షిణదేశము. నేను క్షత్రియవంశంబున జనించితిని. అశ్వారోహణాది వీరధర్మముల నాకు మిక్కిలి పాండిత్యము కుదిరినది. నేను తురగమెక్కి దేశసంచారముచేయుచుఁ బెక్కు దేశములుతిరిగి తిరిగి దైవప్రేరణంబున నీయరణ్యంబున కరుదెంచితిని. ఇందుమీకోట గోడ గనంబడినది.

ఉచ్చైశ్రవస్తుల్యమగు నాఘోటకము లంఘనపాటవంబున నన్నీ కోటలోఁ బ్రవేశపెట్టి తానునాకమున కరిగినది. తరువాత మీ రాజకుమార్తె గనంబడి తీసికొనివచ్చినదని తత్సమయోచితములగు మాటలచే నామె సందియమును బోగొట్టెను. ఆవృద్ధ తల్లంఘన ప్రౌఢిమకు వెఱఁగుజెందుచు సుందరీ! నీకింకను వివాహముకాలేదా! ఈతొలిప్రాయంబున దేశయాత్ర సేయుచుంటివేమి ! రాచవారికిది తగునా? బంధువు లాక్షేపింపలేదా? అని యడిగిన, నతండిట్లనియె.