పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/174

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమద్వరకథ.

161

నీయభిప్రాయము ?

వసు - అవును. సందియమేల? కాయముచేతఁ గాకున్నను మనసుచేత వ్యభిచరింపని వారుండరని శపథముజేసి చెప్పఁగలను.

శ్రీవ - మఱి నీకుమారున కాఁడుదానం బెడ్లిజేయవాయేమి?

వసు — అందులకే నీకూఁతు నిప్పటినుండియు శిక్షింపుమని చెప్పుచుంటిని.

శ్రీవ - ఎట్లు శిక్షింపవలయునో నీవే చెప్పుము.

వసు - -నాయభిప్రాయము వినుము, కన్య జ్ఞాసమువచ్చినది మొదలు భర్తమొగము జూచువఱకుఁ నీనడుమ బురుషుం జూడఁగూడదు. పురుషజూతి యున్నదనికూడఁ గన్యకుఁ దెలుపఁ గూడదు. నీకూఁతు నిగూడ స్థలంబున నునిచి యిప్పటినుండియు నట్లు శిక్షింతువేని గోడలిగాఁ జేసికొనియెదను. నాయభిప్రాయము తెలిసినదియా?

శ్రీవ - బలే. బాగు. నీకోరిక లెస్సగానున్నది. బాలిక పురుషశబ్ద మెట్లు వినకుండును ? తండ్రియు నన్నయుఁ బురుషులుగారా ? వారిం జూడకుండ నెట్లుండును ? అట్లున్నచో లోకజ్ఞాన మేమియుండును! అట్టిదానిం బెండ్లియాడిన నేమి యానందము ?

వసు — వయస్యా ! నాకున్న యనుభవము నీకులేదు. సహజానురాగముతోఁ గూడిన చేడియంగూడిన వేడుక యనిర్వాచ్యమైనది. పెక్కేల. నీకూఁతు నట్టిదానిగాఁ జేయఁగలిగితివేని నాకుమారునకుఁ జేసికొందను. లేకున్న నీప్రస్తావము కట్టిపెట్టుము.

శ్రీవ — మిత్రమా ! నీయభిప్రాయము వడువున నా బాలికం గాపాడెద. స్త్రీలచేతనైన విద్య చెప్పింపవచ్చునా?

వసు — భాషాభివృద్ధికొరకు జదివింపవలసినదియే కాని పురుషుఁడున్నాడను విషయముగల గ్రంథములు చదివింపఁగూడదు. సంగీతము చెప్పించవచ్చును.