పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/171

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మూయుచు మెల్లగా బోటీ! యిందిట్టిమాట పలుకఁగూడదు. చాటునకుఁబోయి మాటాడుకొందము రమ్ము అని చేయిపట్టుకొని యతని నొక విజనప్రదేశమునకుఁ దీసికొనిపోయి కూర్చుండఁబెట్టినది. ఆతండు వెండియునిట్లనియె.

అవ్వా! ఇందుఁ బురుషనామోచ్చారణమే పనికి రాదనుచున్నావు. తత్కారణము తెలిసికొన మఱియుఁ తొందరగానున్నది. అది యట్లుండె నీప్రమద్వర తలిదండ్రు లెవ్వరు? ఆమెకు వివాహ మైనదియా? మీకందఱకు నీమెయే యేలికయని తోచుచున్నది. ఈమెయేకాక యీమె చెలికత్తియలకుఁ గూడఁ బెండ్లికానట్లున్నది. మీకథ యెఱింగించి నాకు శ్రోత్రానంద మాపాదింపుమని కోరిన నావృద్ధ తమవృత్తాంత మిట్లు నివేదించినది.

అని యెఱింగించి, .....తదనంతర వృత్తాంతమిట్లు చెప్పెను.

__________

224 వ మజిలీ.

ప్రమద్వరకథ.

కాశ్మీరదేశ ముత్తరదేశములలో నెల్లధసంపన్నమని ప్రసిద్ధివడసినది. ఆదేశమునకు రాజధాని శ్రీనగరము. దాని శ్రీవర్ధనుఁడనురాజు పాలించుచుండెను. కుబేరతుల్యుఁడగు నమ్మహారాజునకుఁ బెద్దకాలము సంతానము కలిగినదికాదు. ఆనృపునిభార్య నిత్యము సావిత్రీపూజ గావించుచుండునది. అద్దేవి ప్రసాదంబునఁ గొంత కాలమున కాభూకాంతున కొక యాఁడుపిల్ల కలిగినది. ఆశిశువుజాత కర్మోత్సవమునకు శ్రీవర్ధనుఁడు తనకు మిత్రులుగానున్న చక్రవర్తులకుఁ బెక్కెండ్రకు నాహ్వాన పత్రికలు పంపి రప్పించుకొనియెను. అయ్యుత్సవసమయంబున నమ్మహారాజు కోటిదీనారములు దానధర్మ