పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదిగ్విజయము.

157

ఒకవేళ నే నిళునివలెఁ గలికినైతినేమో యనికొనిన నదియుం గానుపింపదు. ఇందుఁ బురుషుండెవ్వఁడు గనంబడఁడు. ప్రమద్వరకు లోకజ్ఞానమున్నట్లు తోచదు. తల్లిదండ్రులెవ్వరనినఁ జెప్పలేకపోయినది. ఇది కపటమేమో యనికొనిన నన్నుఁజూచి యిందెవ్వరు నవయవములఁ గప్పికనక సిగ్గుపడకున్నారు. మఱికొంత చనువుజేసికొని వీరి వృత్తాంతము తెలిసికొనియెదంగాక యని యాలోచించుచుండెను.

అంతలో మఱికొందఱుకాంత లాశుద్ధాంతమున కరుదెంచి యక్కాంచనగాత్రితో ముచ్చటించుచు నీమె యెవ్వతె? నీకీమెతో మైత్రి యెట్లు కలిసినదని యడిగిన విని ప్రమద్వర యీమెవార్త మీకిందాక దారిలోఁ జెప్పితినికాదా? ఈమె యెవ్వతెయో నాకునుం దెలియదు. ఈమెంజూచినతోడనే నాకు వేడుక గలిగినది. సఖురాలిగానెంచి తీసుకొనివచ్చితిని. నాకుఁబోలె నీమెకుఁగూడ మీ రూడిగములు సేయుచుండుఁడని నియమించినది.

అప్పుడప్పడఁతుకలు తమ కుపాధ్యాయునిగానున్న యొక వృద్ధాంగనయొద్దకుం బోయి క్రొత్తమత్త కాశిని రాక యెఱింగించుటయు నాజరఠ తొందరగా నయ్యంతఃపురమునకు వచ్చి యతనిం జూచి యిట్లనియె.

సుందరీ! నీవెందలిదానవు? ఈకోటలోని కెట్లువచ్చితివి? నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నతండు జిఱునగవుతో నిట్లనియె. అవ్యా! యిందున్నయన్నువలెల్లఁ బిన్నవయసువాండ్రే. వీరిలో నీవొక్కరితవే పెద్దదానవుగాఁ గనంబడుచుంటివి. వీరందఱు నాతోఁ బరిహాసమాడుచున్నారను కొన్నాను. నీవుగూడ నట్లేయడిగితివి? కానిమ్ము. ముందుగా నాప్రశ్నముల కుత్తరమిమ్ము. తరువాత నాకథఁ జెప్పెదంగాక. ఈమహారణ్యమధ్యంబునఁ బురుష సహాయములేక మీరందఱు నుండుటకుఁ గారణమేమి? అని యడిగిన నాముసలిది నోరు