పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీకథలు - పదియవభాగము.

చ. వలిపపు చీర బంగరు లవంగపుటంచుల పైఁట గాలిచే
    దొలఁగ మిటారి గబ్బిచనుదోయి బయల్పడ జేర్చికొంచుఁ బై
    వలువ నెలంత వాఱువముపైఁ దగనిల్చియె విస్మయంబుతోఁ
    గలికి మెఱుంగుచూపు లెసగంగనె నానృపసూతి నయ్యెడన్.

అట్లు కనుంగొని మనంబుప్పొంగ నయ్యంగన తురంగమంబు డిగ్గ నుఱికి కలికీ ! నీ వెందుండి వచ్చితివి ! నీపేరేమి ? ఇంతకుమున్నెందుంటివి? నిన్నుఁజూడ వేడుకగలుగుచున్నది. నీకొఱకే కాఁబోలు నేఁడు నాబాడబము కళ్లెమెంతలాగినను నిలువక నీకడకు లాగికొని వచ్చినది. మామేడకుఁ బోవుదము రమ్ము. నీకు గుఱ్ఱమెక్కు పాటవము గలదా ? అని యడిగిన మఱియు నాశ్చర్యమందుచు విద్యాసాగరుండిట్లు తలంచెను.

ఆహా ! ఈమోహనాంగి నన్నంగనగాఁ దలంచి కలికీ యని పిలుచుచు సిగ్గువిడిచి మెలంగుచున్నది. కానిమ్ము అందులకుఁదగినట్లే యుత్తరముజెప్పెదంగాక అని తలంచి పొలతీ ! నా తెఱఁ గవ్వలఁ జెప్పెదంగాక ముందుగా నీయుదంత మెఱింగింపవలయును. నీపేరేమి? ఎవ్వని కూఁతురవు? నీకుఁ బెండ్లియైనదియా! ఈమహారణ్యమధ్యంబున నేమిటికి వసించితివి? అని యడిగిన నప్పడంతి యిట్లనియె,

చెలీ! నీ వడిగినమాటలేమియు నాకుఁదెలిసినవికావు. నాపేరు ప్రమద్వర యండ్రు. నాసఖురాండ్రం దున్నారు రమ్ము. నీమాటలకు వారు సమాధానము చెప్పువారు. ఈవాఱువ మెక్కుము పోవుదమని పలికిన నతం డనుమోదించెను. ఆమె ముందెక్కి యతని నెక్కించికొని తన నడుము బట్టుకొనుమని యుపాయము చెప్పినది. అతండట్లు చేసి తదంగస్పర్శంబున మేనం బులకలుద్భవిల్ల నోహో యీహరిణాక్షికి స్త్రీ పుం వివక్ష తెలియదాయేమి? కానిమ్ము. ఏమిచేయునో చూచెదంగాక అని యాలోచించుచుండ నవ్వేదండగమన రమణీ !