పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కాశీమజిలీకథలు - పదియవభాగము.

స్వతంత్రమేకలిగియున్న చోఁదలచినట్లుజరుగుచునే యుండును. కావున నిఁక దైవముపైనాధారపడ వలసినదే స్వప్రయత్నమేమియుఁబ్రయోజనకారికాదు. అని తలంచుచు నారాత్రియెల్ల నిద్దురబోపక పలువిధంబుల దలపోయుచుండెను.

అంతలోఁ బద్మినీకాంతుడు ప్రాగ్గిరికూట శృంగాటకం బధిరోహించెను. అప్పుడతండు కన్నులెత్తినలు మూలలు చూచుచు నోహో! ఇది నేనొక పర్వతమనికొంటిని కోటగోడవలెఁ గనంబడుచున్నది. ఇందు మహారాజులెవ్వరైనఁ గాపురముండిరేమో దీనిద్వారదేశ మెందున్నదియో చూచి లోపలికిఁ బోయెదంగాక అని తలంచుచు దన వాఱువము సేదదీరినవెనుక నధిష్టించి యాగోడనంటి యుత్తరముగాఁ గొంతదూరముపోయెను ద్వారదేశము గనంబడలేదు. అటుపైఁ బోవుటకు కంటకలతా గుల్మాదు లాగోడనంటి యల్లుకొని యుండుటచే శక్యమైనదికాదు.

తిరుగా వెనుకకువచ్చి రెండవదెస గోడననుసరించి కొంతదూరమే పోఁగలిగెను. పిమ్మటఁ బోవశక్యమైనదికాదు వెనుకకు మరలి మొదటి తావునకువచ్చి యాగోడ యుఛ్రాయము పాఱజూచెను. అక్కోట దనగుఱ్ఱము దాటగలదాయని యాలోచించెను. శక్యముగాదని నిశ్చయించి యందుగనంబడిన తెరపిని దనగుఱ్ఱమును నడిపించెను. కొంతదూరము బోవునంతఁ బిమ్మట దారిలేకపోయినది. వెండియు మొదటి చోటునకువచ్చి యచ్చటనే నిలిచి గుఱ్ఱమునుదిగి యందలి ఘానముచే దానిం దృప్తిపడఁజేసి తానేవియో ఫలములుదిని యాఁకలి యడంచుకొని యాకోటగోడదాటు నుపాయ మాలోచించు చుండెను,

చూడంజూడ నాగోడకొకచోఁ బైరాళ్ళు దొర్లుటచే రెండుబారలమొఱ్ఱి గనంబడినది. అందలి కుడ్యోఛ్రాయము కొలిచికొనిఁ దానిఁ దాటవచ్చునని నిశ్చయించెను. అతని వాఱువ ముత్తమజాతి