పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

3

వంబున నశేషపురాణస్థంబులైన నారదకథావిశేషంబులెల్లఁ గరతలామలకంబుగాఁ దెలిసికొని మేను పులకరింప వాని కిట్లనియె-

వత్సా! సంసారలతాలవిత్రమగు నారదముని చరిత్రము విచిత్రకథాభూయిష్ఠమై యొప్పుచున్నది. నారదకథావిశేషములేని పురాణములులేవు. భారత భాగవత రామాయణములు తదుపోద్ఘాత ఖ్యాతములైయొప్పుచున్నవి. పెక్కేల! సమస్త పురాణములందు నేభాగము పరికించినను నేఘట్టము జదివినను నారదోక్తములగు కథలే కనబడుచుండును. నారదమహర్షికథాప్రశంస లేని గ్రంథమేలేదు. అక్కథలన్నియుం జెప్పుటకుఁ బెద్దకాలము పట్టును. సర్వజనసాధారణములైన తత్కథావిశేషంబులఁ గొన్ని యెఱింగించెద. నవహితుండవై యాలకింపుము. కల్పాదినివివరించిపద్మనాభు నాభికమలంబున జనించి పెద్దకాలము తపంబుగావించి పరమేశ్వరు నానతి సృష్టి సేయఁదలంచి తత్పరికరముల నరయుచున్నంతఁ బంచభూతము లావిర్భవించినవి. తదనంతరమున,

శ్లో. మరీచి రంగిరా అత్రిః పురస్త్య: పులహఃక్రతు!
     షడేతెమానసా: పుత్రా బ్రహ్మణస్సుమహాబలా: !!

మరీచి, అంగిరస్సు, అత్రి, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు అను మహర్షు లాఱ్వురుద్భవించిరి. బ్రహ్మ మనంబునం దలంచినంతనే జనించుటచే వారికి బ్రహ్మమానసపుత్రులని పేరువచ్చినది. తరువాత నతని కుడికాలి పెనువ్రేలినుండి దక్షుండు నెడమకాలి వ్రేలి నుండి యసిక్నియను కన్యకయు హృదయమునుండి ధర్ముఁడు స్తనమునుండి భృగుఁడుతొడనుండి సారదుఁడును జనించిరి.

అరవిందభవుండు వారినందఱ నాదరించుచు బిడ్డలారా! మీరెల్ల ననుగుణ సతీయుతులై మత్సంకల్ప ప్రకారంబు ప్రజాసర్గము గావింపవలయును. ఇదియ మదీప్సితంబని యానతిచ్చుటయు,