పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/154

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయమల్లునికథ.

141

వచ్చి రాజపుత్రా! నేనీ ధాత్రీపతి పుత్రికను నాపేరు ప్రభావతి యండ్రు మాతండ్రి నిన్న రాత్రి మిమ్ముల నెవ్వరో శత్రువులనికొని తెలియక కట్టించి యీ చెఱసాలం బెట్టించిరి. తఱువాత మీకథవిని పశ్చాత్తాపముఁ జెంది మీ మొగముఁ జూడ లేక సిగ్గుపడుచు మీ సత్కారమునకై నన్నుఁ బంపిరి.

ఈ చెఱసాల కేళీభవమనికొని నన్నుఁ బ్రియరాలిగా నెంచి నామాట మన్నించి యీతప్పు సైరింపవలయును. మీ రాఁకలిఁగొనియుంటిరి. భుజింతురుగాక మాశుద్ధాంతమునకు రండని వినయముగాఁ బ్రార్థించినది. దాని యనునయవచనోదకము మదీయ కోపాసలముజల్లాఱఁ జేసినది. అచ్చిలుకలకొలికి చిత్తము నొచ్చునేమో యని యేమాటయు నాడనేరక నే నామె చెప్పిన ట్లొప్పుకొని యప్పుడే యప్పడఁతి వెంట నంతఃపురమున కరిగితిని.

అయ్యిందువదన నాకందు గావించిన విందు లిట్టివని చెప్పఁజాలను పిమ్మట నమ్మనుజపతి మంత్రిహిత పురోహితాదులతోవచ్చి నా పాదంబులంబడి శరణు వేఁడుకొనియెను. నే నభయహస్త మిచ్చితిని. వెంటనే యా వాల్గంటిని నాకిచ్చి వివాహముగావించెను. నేనత్తరుణీ రత్నము సల్లాపనైపుణ్యమునకుఁ జొక్కి ప్రస్తుత కార్యాంశము మఱచి నాలుగు దివసములొక్క గడియవలె వెళ్ళించితిని.

ఇంతకుఁ బూర్వమే నీవు పంపిన సందేశ పత్రికం జూచి జడియుచు దుందుమారుండది కూఁతునొద్దకనిపెను. ఆకొమ్మ యాకమ్మం జదివికొని యురముపైఁ జేయివైచికొని మనోహరా ! మాయన్నల తెఱంగే నెఱుంగనిదికాదు. వారు సెప్పినంతసేయుదురు. మీరువేగఁబోయి వారి కోప ముపశమింపఁజేయుఁడని ప్రార్థించినది. వెంటనే గుఱ్ఱమెక్కివచ్చితిని. ఇది నావృత్తాంతము అనిచెప్పి నీవిన్నినాళ్లెక్కడనుంటివి? జయదేవుఁడునిన్నుఁ భరిభవించుట యసత్యమాయనియడి.