పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/152

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయమల్లునికథ.

139

దులతో నాశనముచేసి నీకోటత్రవ్వించి కందకములఁ బాఱవేయింతు నిందులకు రెండు గడియలు గడువిచ్చితి గాచుకొనుము.

ఇట్లు రాగవర్ధనుఁడు.

ఆపత్రికం జదివికొని యాదుందుమారుండు గడగడలాడుచు జయమల్లు నొక్కనినే యశ్వ మెక్కించి యతని చెంతకుఁబంపెను. సందేశమంపిన గడియకాలములోఁ దనకడకరుదెంచిన జయమల్లుం జూచి రాగవర్ధనుం డాశ్చర్యపడుచుఁ గౌఁగిలించుకొని గారవించెను. అతండు రాగవర్ధనుం జూచి వెఱగుపాటుతో నమస్కరించెను.

రాగపర్ధనుండు తమ్ముడా ! దుందుమారుఁడు నిన్నుఁ గట్టించెనఁట సత్యమేనా యిప్పుడే వదలెనా ? యేమి చేసె? యధార్థము చెప్పుమని కారణము వినుదనుక నాకినుక చల్లాఱకున్నది. అని యడిగిన నతం డిట్లు చెప్పెను.

అన్నా ! నీవు గాలివానం దారిదప్పి జయపురంబున కరిగితివనియు నీతో వచ్చిన రౌతులు నిన్నొక సత్రంబున నిలిపి నీరాక నారాజున కెఱింగింప నరిగి తిఱుగవచ్చునప్పటికి నీవందు గనంబడ లేదనియు నీజాడనరయుచు నాలుగు దివసంబులం దుండి యాసాదులు తెలియక మరలి యింటికి వచ్చి యావార్త తండ్రిగారి కెఱింగించిరి.

రాజుల హృదయములు క్రౌర్య పూరితములై యుండును. అవమానింపఁబడినవారు నమ్మినట్లే యుండి యదనువచ్చిన తఱి పరిభవింపక మానరు. జయదేవుఁడు చిన్న వారలచే నోడింపఁబడిన వాఁడగుట నీసుబూనియుండును. రాగవర్ధనుం డొంటిగా నాపురి కరుగఁగూడదు. అరిగేఁబోఁ దనరాక రౌతులచేఁ బతికేల తెలియఁ జేయవలయును . జయదేవుఁడు రాగవర్ధను నవమానపఱచియుండు నని విచారించుచుండ నేనును బ్రతాపరుద్రుఁడును వారి నూఱడించి మమ్ముఁ బంపుమని కోరితిమి.