పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

కాశీమజిలీకథలు - పదియవభాగము.

క. దీవించి యతఁడు వత్సా!
   నీవదనముఁజాడఁజూడ నేఁడిచ్చట నే
   దో వీంతఁ జూచివచ్చిన
   భావంబది దోచెఁ దేటపడఁ దెల్పుమనన్,

సీ. ఇది చిన్నకొట్టిక యిం దేవిశేషంబు
             గానంగఁబడలేదు గానిసామి!
    సీమాంతమున నొక్కగ్రామదేవత యాల
             యము గ్రాలు దానికుడ్యములయందుఁ
    దమకుఁదోచిన విగ్రహములను వ్రాసి పో
             వుదురు పాంథులు వాని పొంత నరయ
    వల్లకీకరుఁడు భాస్వజ్జటాధరుఁడు నా
             రదమహామౌనివిగ్రహము నాకుఁ

గీ. గానఁబడె నేత్రపర్వంబుగా మహాత్మ
    విస్మయప్రదమగు తత్ప్రవృత్తులెల్ల
    వినఁగ వేడుక జనియింప వేగ నిటకు
    వచ్చినాడ నియ్యదియ మద్వాంఛితంబు.

గురువర్యా! అమ్మహాత్మునిచరిత్ర మెన్నియోసారులుమిమ్మడుగఁదలంచుచుండియు నేదియో ప్రసంగవశమున నామాట మఱచి పోవువాడను. నేఁడ వ్విగ్రహదర్శనమూలముగా నేతత్ప్రశ్నావకాశము గలిగినది. నారదమహర్షి యెవ్వనికుమారుఁడు? ఎప్పుడు పుట్టెను. నివాసదేశ మెయ్యది? మహర్షియయ్యు నొండొరులకుఁ గలహములు పెట్టు టేమి? విరాగియయ్యు సంగీతప్రియుండెట్లయ్యె? దేవమునియయ్యు మూఁడులోకములు దిఱుగుచుండనేల? ఈసందియము లన్నియుఁ దీర నారదమహామునిచరిత్ర మంతయు సవిశేషంబుగా నెఱింగింపు మని ప్రార్థించుటయు మణిసిద్ధుండు నిజమణిప్రభా