పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/147

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కాశీమజిలీకథలు - పదియవభాగము.

దోఁచిన గీతంబులంబాడుమని నియోగించుటయు నమ్మించుబోఁడి యందలి పీఠంబునంగూరు చుండి విపంచి మేలగించి పంచమస్వరాను కరణముగా నాలాపించి తనకుఁగల గాంధర్వవిద్యా విదగ్ధత్వంబుఁ దేటపడ హాయిగాఁ బాడి యతని రాగసముద్రములో మునుంగఁ జేసినది.

అప్పుడతం డాత్మగతంబున నాహా యీగాయనీరత్నము కర్ణరసాయనముగాఁ బాడినది. ఈమెంజూడ నా రాజపుత్రుని చిహ్నములు గనంబడుచున్నవి. ఈయువతి యతని చెల్లెలు కాదుగదా చెల్లెలేయైనచో క్రొత్తవాఁడనగు నాకడ నిట్లు విస్రబ్ధముగానిలిచిపాడునా? నాచిత్తమీ మత్తకాశినింజూచినతోడనే సంకల్పభవాయత్త మగుచున్న దేమి? అయ్యో! రాజవుత్రుడు నాబుద్ధింబరీక్షించుటకుఁ గపటముగా నీమెనిందుఁ బంపెనా! ఈమెతోనతఁడు రాకపోవుట శంకా స్పదముగానున్నది. ఈయేకాంతవాసంబు నా కుత్కంఠఁగలిగించుచున్నది. ఈలలన కులకాంతయైన నగుంగాక వేశ్యయైన నగుంగాక దీనింగలియ వేడుకఁబొడముచున్నది. అని తత్తఱించుచుఁ దటాలున నాకుటిలాలక చేయుపట్టుకొని జవ్వనీ! నీనెవ్వతెవో చెప్పితివికావు. మనోహరముగాఁ బాడి నాహృదయ మాకర్షించితివి. నీకుఁ బారితోషిక మీయనున్నాడ గోరికదెలుపుమని యడిగిన నప్పడఁతి యించుకపటకోప మభినయించుచు నిట్లనియె.

పురుషోత్తమా! మా రాజవుత్రుడు మిమ్ము సత్కరించుటకై వినోదముగా నాచేఁబాడించెను. మీచే గానభృతినందుటకు నేను వేశ్యనుగాను మీరు పరస్త్రీ పరాఙ్ముఖులని చెప్పుటచేఁ జెంగట నిలిచి పాడితిని. మీరు సంతసించితి రింతియ పదివేలు నాకుఁ గానుక లవసరములేదు మఱియుఁ బరాంగన కరంబుఁ బట్టవచ్చునా? ఇది మీ దేశాచారముకాబోలు చేయివదలుండు పోయివత్తునని పలికి లేవఁబోయిన వారించుచు నతండిట్లనియె.