పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/139

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లేవని చెప్పవచ్చును. వానినన్నియు మనదేశమునకుఁ దీసికొని రాఁదలంచితిమి. కావున నీగొలుసు చివర బిలపరిమాణముకన్న తక్కువగా వర్తులములైన మందసములఁగొన్ని గట్టించి దిగవిడుచు చుండుము వానిలో నీవస్తువులుంచి పంపుచుందుము. ఈబిలమొక మనుష్యుండు మాత్రము పట్టునంత వైశాల్యము గలిగియున్నది. కావున వరుసగా నాలుగైదు సంచులంగట్టించి విడువుము వానిలోమేము దూరి వచ్చు చుందుము, గాలి తగులునట్లిందుండి చర్మభస్త్రికలచే నూదింతుము. మేముపైకివచ్చుటకు నింతకన్న మంచియుపాయములేవియైనఁ దోచినచో నట్లుచేసి గొలుసు దిగవిడుచుచుండుము. ఎప్పటికప్పు డుత్తర ప్రత్యుత్తరములు దెలిసికొనుచుండవలయునని యెన్నియో విషయములందు వ్రాసి పంపిరి.

ప్రతాపరుద్రుఁడు వ్రాసినరీతిగా నొకదివసముమాత్ర మందు నిలిపి పిమ్మట నాగొలుసు లాగఁబడినది. పరమసంతోషముతో నా వింతజూచి రాజకుమారు లిరువురు నంతఃపురమునకరిగి భార్యలకుం జెప్పి కనకరత్నమండనాది విశేషముల మందసముల నెక్కించుచుఁ బ్రయాణసన్నాహములో నుండిరి,

అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది మణిసిద్ధుండవ్వలికథ పైమజిలీయందిట్లు చెప్ప మొదలువెట్టెను.

___________

221 వ మజిలీ.

రాగవర్ధనునికథ

గోపా! వినుము తాళధ్వజుని మూఁడవకుమారుఁడు రాగవర్ధనుఁడు తండ్రియాజ్ఞబూని యన్నలజాడఁ దెలిసికొనఁబయలుదేరి గాలి వానచే దారితప్పి జయపురంబుఁ బ్రవేశించెనని నీవెఱిఁగియుంటివిగదా..