పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతలరాజ్యముకథ.

119

నిందుఁబడవేసినది మీరెఱిఁగియే యుందురు. వారితమ్ముఁడు ప్రతాప రుద్రుఁడట అన్నలజాడఁ దెలిసికొన నరుదెంచి యలంబసునొద్దకు వచ్చి నమస్కరించి తనయన్నల వృత్తాంతము చెప్పుమని యడిగెను. వాని కంఠధ్వని వినినంతనే వానికి నాకుఁ గూడ వెరపుగలిగినది. ఆవెరపు వెల్లడికానీయక మనయలంబుసుఁడు పన్నవలసిన వ్యూహమంతయుఁబన్ని చివఱకు వాని నాకొండశిఖరమెక్కి గుహచూచుట కంగీకరింపఁజేసెను. నాకుఁ గనుసన్నఁ జేసి వానికా గుహజూపింపుమని నియమించుటయు నేను వాని వెంటంబెట్టుఁకొని కొండయెక్క, దొడంగితిని.

వాఁడు దారిలో నన్ననేక ప్రశ్నములడిగి నాహృదయాశయము గ్రహింపవలయునని తలంచెనుకాని నేనేమియు నవకాశమిచ్చితినికాను. వాఁడు మాకపటము మొదటనే గ్రహించెనని నే నెఱుంగకపోయితిని. వాఁడు కొండయెక్కునప్పుడు నా వెంట నడుగులో నడుగువైచి యెక్కుచుండెను. శిఖరమెక్కి గుహావిశేషములు నేను జూపించుచుండ వానియందుఁజూపులు వ్యాపింపఁజేయక నేలయే పరిశీలించుచు నడుగులు వైచుచుండును. నేనాగినఁ దానుగూడ నాగును. వానిముందుఁ బెట్టవలయునని నేనెంతయో కపటముజేసితిని. వాఁడు నావలలోఁ బడలేదు. గుహలోని మీటవఱకు నేనుముందునడిచి యందునిలువంబడి అయ్యా! మాయన్నలామళువులో నున్నారు. ఆబల్లయెక్కి చూడుఁడని నేను జెప్పఁగా కడునడు నీవేయెక్కి చూపుము. అని నన్ను బలాత్కారముగాఁబట్టి యాబల్లపైకిఁ ద్రోసివిడిచెను.

మీటసడలి నేను గుబాలున నీవివరములోఁబడితిని. పడునప్పుడు వానిచేయిబట్టింటి. అతఁడు కేలువిదళించుటచే వానియుంగర మూడి వచ్చినది. వాడు దొరకలేదు నేను జారివచ్చి యిందుఁబడితిని. ఇదియే నావృత్తాంతము తరువాత నతండు అలంబసుని నిజస్థితి గ్రహించెనో లేదో తెలియదు. అని తనవృత్తాంతమంతయు వాఁడెఱింగించెను.