పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/126

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నావతికథ.

113

కేరూపము పూజ్యముగదా. విద్యమాట యటుండనిండు. పరాక్రమము వితర్కింపఁదగియున్నది. ఇందఱలో లోకైకపరాక్రమశాలి యెవ్వఁడో లేచి నిలఁబడినచో వానికీరత్నమాల నర్పించుచున్న దాన నదియే మదీప్సితమని పలికించుటయు నారాక్షసవీరులెల్ల నొండొరులు మొగములు జూచుకొనువారును గుజగుజలాడువారును ఊర్ధ్వముఖులై యాలోచించువారునై యాకాలములో నెవ్వండు నేనని ప్రత్యుత్తరమిచ్చినవాఁడు లేకపోయెను.

అప్పుడు పద్మసేన యిందులకు మూడుదినములుగడువిచ్చితిని. ఈలోపలమీరాలోచించుకొని లోకైకవీరుండని యెల్లరు సమ్మతించిన వాఁడు నాకడకరుదెంచిన సన్మానింతునని పలుకుచు నారాజ పుత్రిక ద్విజటతోఁగూడ నాందోళికమెక్కి, యంతఃపురమునకరిగినది. కాలకేతుఁడు - (లేచి) ఓరాక్షసమిత్రులారా ! నాపరాక్రమము మీరందఱు నెఱింగినదే నేనులోకైకవీరుండననిచెప్పిన మీరంగీకరింతురా.

దుర్ముఖుఁడు – నీవు మహిషునికన్నను చండునికన్నను ముండునికన్న నధికుఁడవా యేమి ? వారి మ్రోల నీ వెంతవాఁడవు ?

తామ్రుఁడు - శుంభ నిశుంభాసురులుండ చండముండాసురుల ముందుగాఁ బేర్కొంటివేల?

దుర్ముఖుఁడు - చండముండులకన్న మహిషునికన్న శుంభ నిశుంభులధికులనియా నీయభిప్రాయము!

త్రాముఁడు - అవును సందేహమేల?

రక్తబీజుఁడు - మీయిరువురవాదములు నపరిజ్ఞాతృత్వంబును వెల్లడించుచున్నవి. జగదేకవీరుండు భండాసురుండుండ నొండువానిం బేర్కొందురేల?

చండుఁడు - రక్త బీజా! ఏమి నీక్రొవ్వు? మేమువీరులమనుట యపరిజ్ఞాతృత్వంబా! ఇంకొక్కమారట్లు పలుకుము,