పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/121

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మనోహరా! మీరిందులకుఁ జింతింపవలదు. నేనందలి రహస్యము దెలిసికొందును వారింట నాసఖురాలొకతెయున్నది. దానివలన సమస్తము విదితముకాఁ గలదని పలికి యప్పుడే రత్నావతిని దీసికొనిరమ్మని ద్విజటనంపినది. అది వోయి రెండుగడియలకు నాయెల నాగను దీసికొనివచ్చినది. ఇరువురు నిట్లు సంభాషించుకొనిరి.

రాజపుత్రి - సఖీ! రత్నావతీ ! నీవీ నడుమగనంబడుటలేదేమి ? మననేస్తము మఱచితివా?

రత్నావతి – సరిసరి నీవట్లనరాదు. నీవు రాజపుత్రికవు మేము సేవకురాండ్రము నీతోమాకు సాటియా! నీ సెలవైనచో నిత్యమువచ్చి పాదసేవ చేయకపోదునా?

రాజపుత్రి - సఖీ! ఇందు సేవ్యసేవకన్యాయముతోఁ బనిలేదు. నేస్తమేకావలసినది. నీవంతగామన్నించిన నాకుఁగష్టముగానున్నది.

రత్నావతి – రత్నమునకుఁ గాచమునకు నెంతభేదమున్నదో నీకును మాకునంత తారతమ్యమున్నది నీవుగర్వశూన్యురాలవు కావున ని ట్లనుచున్నావు.

రాజ -- మైత్రిలోని హెచ్చుతగ్గులు విచారింపవలదనిచెప్ప లేదా.

రత్నావతి — దేవీ! విద్యచే ధనముచే రూపముచేతఁ గూడ నీతో మేమీడుకానేరము నీయనుగ్రహ కాంక్షులము ఆదరించి మాటాడితి విదియ పదివేలు.

రాజ -- నన్ను దేవీయనవలదు సఖీ! అనిపిలువుము సంతసించెదను.

రత్నా - నీహృదయశుద్ధి యట్టిది.

రాజ — నరాంతకుఁడు నీకు మేనత్తభర్తకాడా?

రత్నా - అవును మేము వారింటనే యుందుము.

రాజ -- నరాంతకుని భార్య గర్భవతియైనదఁట కాదా? అవును ఇదియే ప్రథమగర్భము చిరకాలమునకు వచ్చినది.