పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/118

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

105

మఱియొక నరకళేబరము సంపాదించునేమో అడిగివత్తుంగాక.

అనియాలోచించుకొనుచు మఱునాఁ డుదయమునకే లంజోదరియొద్దకుఁబోయెను. అదివానింజూచి బావా! మీయింటనేఁడు సీమంతోత్సవముకాదా? తీరుబడిగానుంటివేమి? నాపంపినమాంసము నిలవయున్నదా! వానినెప్పుడు చంపితిరి? అనియడిగినవాఁడు-తెల తెల్లఁబోవుచు నోసీ! నీవుపంపిన మానిసినిఁజంపక పెంపుడు పశువునకుంబోలె నాహారము దిట్టముగాఁ బెట్టించితిని. ఆమిండఁడు తెగబలిసి గండుమిగిలి మాకు తెలియకుండ నిన్న తాళములు విరుగగొట్టి పారిపోయెను, మాకర్మమునకు నీవేమిచేయుదువు? ముహూర్తము మార్చెద మరియొక నరవలలము సంపాదింపగలవా? అనియడిగిన నాదానవి కటకటంబడి యిట్లనియె. సీ. సీ. మీరెట్టిమూర్ఖులు వానికాలుసేతులు విరచి చావనీయక తగునాహారముపెట్టి పెండ్లికొడుకువలెఁ బోషించినఁ బాఱకుండునా ? రెండుసారులు మీకొఱకై కష్టపడితిని. ఇక మీకుపకారము సేయ జూలను. వాఁడెందుఁ బోఁగలడు రాజుగారికిఁ దెలియఁబరచి వానింబట్టి తెప్పింతు జూఁడుము కాని మీకు వానిమేనిమాంసము లభ్యము కాదు వేరొక తెరువాలోచించుకొనుఁడని పలికి నరాంతకునంపి యప్పుడేఱేనికొక చీఁటియిట్లు వ్రాసినది.

జయము మహారాజా జయము.

నిన్న నొకమనుష్యుఁడు యంత్రశిలాఫలకముమీఁదఁబడివెంటనేలేవబోయెను. అప్పుడు కుంభుండు దుడ్డుకఱ్ఱతో వానినెత్తిపైఁ గొట్టఁబోయిన వాఁడాదండములాగికొని కుంభునిఁజావమోది వాఁడు నేలంబడియుండ నాకుఁ గనంబడకుండ నెక్కడికో పారిపోయెను. ఇదివఱకిట్టి విచిత్రమెన్నఁడును జరిగియెఱుంగను. వాడెట్టిబలవంతుఁడో తెలియదు వానివెదకి పట్టించి తెప్పింపఁ గోరుచున్న దాన,

ఇట్లు మీపాదసేవకురాలు, లంబోదరి.