పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/113

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

కాశీమజిలీకథలు - పదియవభాగము.

    జూతునే తల్లిదండ్రులచేత గౌఁగ
    లింపఁబడుదునే మ్రొక్కిదీవింప వారు.

అయ్యో! ఈయంథకారమువోయి తిరుగా వెలుగువచ్చునా ? యీఱేయి నేమృగమో భక్షించిన నన్నియిడుములు నటమటమై పోవును. అని మఱియు నేనెంతమూర్ఖుండనైతి, కర్తృత్వము మీఁదనిడకొని విచారించుచున్నాఁడ. రత్నావతి కైతవంబుగ మృత్యుముఖంబునుండినన్ను దాటించినవాఁడిప్పుడీ చీఁకటిని బోఁగొట్టిసుఖింపఁజేయలేఁడా? సుఖము దుఃఖమునకు దుఃఖముసుఖమునకు నొక్కప్పుడు హేతువగుచుండును. పుస్తకములో వ్రాయఁబడినప్రక్రియ సత్యమేయైనచో నాకునిరతిశయు సౌఖ్యంబుగలుగఁగలదు, అనియనేకవిధంబులదలంచుచుండ నతనిహృదయసాధ్వసంబుతోఁగూడ నాయంధకారమువిచ్చి నలుదెసల నేదో ప్రకాశము వ్యాపించినది.

అతఁడప్పుడు నలుదెసలు పరికించుచుఁబుస్తకములోనున్న విధానమంతయుంజదివికొని త్రికూటగిరిమధ్యమప్రదేశమున నొకబిలముండునని వ్రాయఁబడియుండుట, ద్రికూటమును గురుతుజూచుకొని యాగిరి మధ్యదేశమునులక్ష్యముగానుంచుకొని యెక్కుట ప్రారంభించెను. మిక్కిలిశ్రమపడిజాముప్రొద్దెక్కునప్పటి కామధ్యభాగముజేరెను. అందుబిల మెందున్నదో యని రెండుగడియలు పరిక్రమించి పరిశీలింపుచుండనొకచోటఁబాషాణముచేతఁ గప్పబడియున్న ప్రదేశమునుజూచి మఱికొన్ని చిహ్నములంబట్టి యదియే బిలమని తెలిసికొనియెను.

అందొక వేదికపైఁ గూర్చుండి పుస్తకము చదివి తదుక్తప్రకారంబు రాతిసంఘట్టనంబున నగ్నిఁబుట్టించి సమిధలచేఁ బ్రజ్వరిల్లంజేసి కల్పోక్తరీతి మంత్రంబులు పఠించుచు వేయిసార్లు సమిద్ధోమంబు సేసి పూర్ణాహుతి గావించినతోడనే పఠేల్లుమనియడ్డముగానున్న రాయిపగిలి శకలములై మార్గమిచ్చినది. అంతలో నాసింహద్వారంబు నానామణి