పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లనియుఁ గామినులనియు వ్రాయఁబడియున్నది. పేరులంబట్టి వారెట్టివారో తెలియఁబడలేదా వారిని మఱిఁగి నిన్ను మఱచిపోవుదునని నీయభిప్రాయము అట్లుసేయఁజాల నిదిగో నాయుంగరమునీకుఁ గురుతుగానిచ్చుచున్నాఁడ నీవేనాప్రాణేశ్వరివి. ఇదిగో గాంధర్వవిధినిన్నుఁబరిగ్రహించితినని పలుకుచు నామెచేయిపట్టుకొని ముద్దువెట్టుకొనియెను.

రత్నావతియు నతనిమాటలకు సంతోషించుచు మనోహరా! నీవుపవాసములచే డస్సియున్నావు. ఎక్కడికిఁబోదువో యేమిజరుగునో తెలియఁజాలదు. ఇంక నాలుగు దినములవఱకు నిందుండినఁ బ్రమాదము లేదు. ఎల్లుండిపోవుదువుగాక నీవియోగము నాకు దుర్భరవేదనగలిగించునట్లు తోచుచున్నది. ఇదెక్కడితగులమో తెలియకున్నది. ఈమూఁడు దినములు నాయిచ్చినయాహారము గుడుచుచు బలముగలుగఁజేసికొనుమని బ్రతిమాలిన నతఁడిట్లనియె.

ప్రాణేశ్వరీ !నిన్ను విడిచిపోవుట నాకునుగష్టముగా నేయున్నది. నేను వెళ్లిననాఁడే నాయవసరమువచ్చి పారిపోయితినని తెలిసినచో నలుమూలలువెదకి పట్టుకొందురేమో!ఇంచుక వ్యవధియుండిన నేను దూరముగాఁ బోఁగలను మఱియు నీపుస్తకము నేను దీసికొని పోవచ్చునా? దీనివలన నీకు మాటవచ్చినచో నిచ్చియే పోయెదను. ఇందలి విషయములు కంఠస్థములు సేసికొనుచున్నాను. అని నొడివిన నప్పడంతి యిట్లనియె.

మా నరాంతకుఁడు వజ్రకంఠునికి దగ్గిరచుట్టము. వానిభార్య చిరకాలమునకు గర్భవతియైనది. ఱేపుచేయఁబోవు సీమంతోత్సవము మహావైభవముతోఁ గావించును. పదిదినములవఱకు త్రాగి మత్తిల్లి యొడలు తెలియకుండ సంచరింతురు. తరువాత రాజపుత్రిక పద్మసేనకు స్వయంవర మహోత్సవము జరుగును. అతొందరలో నీవుస్తకముమాట యెవ్వరికిఁ గావలయును! నీవు తీసికొనిపోవచ్చును. అనిచెప్పి చేతులు ముద్దుపెట్టుకొనుచు నతనియుంగరము భద్రపరచికొని మెల్లన తలుపు