పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

95

రెండుచేతులుజోడించి మ్రొక్కినంతనక్కాంతారత్నము కన్నులనుండి ప్రవాహముగా వచ్చుచున్న యశ్రుబిందువులఁ బైటచెఱంగున నద్దుకొనుచు పురుషరత్నమా! నీమాటలు నేను వినలేకున్న దానను. నిన్నుఁ జూచినదిమొదలు నాహృదయు మేమియోకాని యుత్కంఠితమైయున్నది. నీవు మృతినొందిన నేనుగూడ నీతోమృతినొందెదనని తెలిసికొమ్ము. నీదైన్యోక్తుల నేవినఁజాలకున్నదాన మఱియు నొక్క విశేషంబెఱింగించెద నీవేమిచదివితివి? దేవనాగరలిపి నీకుఁదెలియునా అని యడిగిన నతండిట్లనియె.

కన్యామణీ! దేవనాగరలిపి యననేల సమస్తలిపులు నాకుఁదెలియును. అడవిఁగాసిన వెన్నెలవలె నాచదువిక్కడ నేమియుపమోగించెడిని? ఎంతేనిజదివితివి అట్లడిగితివేల! అనిపలికిన నక్కలికి యలరుచు మనోహరా! వీరింట నొకపుస్తకమున్నది. అందనేక సిద్ధులు వ్రాయఁబడియున్నవఁట దేవలోకమునుండి యాపుస్తకము నెత్తికొని వచ్చిరి. కాని యాలిపి వీరికిఁదెలియక తొట్రుపడుచున్నారు. శుక్రాచార్యుల యొద్దకుఁ దీసికొనిపోయి యడుగవలయునని తలంచుచున్నారు నేనాపుస్తకముఁదెచ్చి నీకిచ్చెదను దానింజదివిన నేదేని సాధనముతోపక మానదు. అందనేకసిద్ధులు సమస్తభువనముల విశేషములు వ్రాయబడి యున్నవఁట. తెమ్మందువా! అనుటయు నతండు కానిమ్ము నాకింక ఱేపటివఱకు నాయుర్దాయమున్నది కాఁబోలు. అందలి విశేషంబులఁ దెలిసి తరువాతనేమృతినొంద వచ్చును. అనిపలుకుచు నాచెలువదెచ్చిన యాహారము భుజించెను.

ఆరత్నావతియు నతని విడువలేక విడువలేక పెద్దతడవం దుండి ఱేపా పుస్తకము దెత్తునని చెప్పి తలుపులు వైచి లోపలకుఁ బోయినది. ఆరాత్రియెల్ల నతండు నిద్రఁబోవక తన దురదృష్టమును గుఱించి విచారించుచు నెట్ట కేలకుఁ దెల్లవార్చెను. రత్నావతియు నతిప్రయ